తెలంగాణ

telangana

ETV Bharat / business

పసిడిపై పెట్టుబడితో బంగారు భవిష్యత్తు

భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం బంగారం. దేశంలో పసిడి కొనే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇందుకు సంప్రదాయ, ఇతరత్రా కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని రోజులుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి సమయాల్లో అందరికి వచ్చే సందేహాలు.. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయాలా వద్దా? నిపుణులు ఏమంటున్నారు? భవిష్యత్తు​లో బంగారం ధరలు ఎలా ఉండనున్నాయి? అన్ని సందేహాల నివృత్తికై ఓ ప్రత్యేక కథనం.

By

Published : Aug 22, 2019, 9:26 PM IST

Updated : Sep 27, 2019, 10:20 PM IST

పసిడి

ప్రస్తుతం పసిడి ధరలు రికార్డు స్థాయిల వద్ద కొనసాగుతున్నాయి. ప్రతి రోజు తాజా గరిష్ఠాలతో రికార్డులు తిరగరాస్తోంది బంగారం. అయితే పుత్తడి ధరల పరుగు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏడాదిన్నర వరకు ధరల పెరుగుదల ఇలానే కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. వచ్చే 18 నెలల్లో రూ.14వేలు పెరిగే అవకాశం ఉందని అసోసియేషన్‌ ఆఫ్‌ టెక్నికల్‌ మార్కెట్‌ విశ్లేషకుడు, హైదరాబాద్‌ చాప్టర్‌ అధిపతి బ్రహ్మచారి తెలిపారు. ప్రస్తుత రూపాయి విలువ ప్రకారం వచ్చే ఏడాది జనవరి వరకే 10 గ్రాములు బంగారం ధర రూ.42వేలను తాకే అవకాశం ఉందని ఆయన అన్నారు.

హైదరాబాద్‌ చాప్టర్‌ అధిపతి బ్రహ్మచారి

బంగారంపై పెట్టుబడి మంచి నిర్ణయమే...

ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా బంగారంపై పెట్టుబడి స్వల్ప కాలంతో పాటు దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుందని బ్రహ్మచారి అంటున్నారు. అయితే మధ్యలో కొన్ని హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గోల్డ్ ఈటీఎఫ్​లు లాంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో కొనుగోలు చేయటం వల్ల తరుగుదలను అధిగమించవచ్చని అంటున్నారాయన. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల దిశగా పయనిస్తున్న దృష్ట్యా బంగారంపై పెట్టుబడి పెంచుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో మేలైన విషయమేనని అభిప్రాయపడ్డారు.

ధరల పెరుగుదలకు కారణాలివే..

బంగారం ధర పెరుగుదలకు దేశీయ, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం వల్ల ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయాలతో ప్రజలు, ప్రభుత్వాలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

చైనా, భారత్​తో పాటు ఐరోపా దేశాలూ పసిడిపై పెట్టుబడులు పెంచాయి. ఒకప్పుడు ఆభరణాల్లో బంగారానికి ఉన్న డిమాండ్ ఇప్పుడు లేకపోయినప్పటికీ భారీ స్థాయిలో ప్రభుత్వాలు కొనుగోళ్లు జరుపుతున్న కారణంగా డిమాండ్‌ అధికమైంది. ఈ పరిణామాలు ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉందని విశ్లేషకులు తెలిపారు.

పసిడి ధరల పెరుగుదలకు అమెరికాతో సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్లు తగ్గిపోవటం మరో కారణం. దీనితో బాండ్లు, పొదుపులపై రాబడులు తగ్గిపోయాయి. స్టాక్‌ మార్కెట్లు ప్రతికూలంగా ఉండటం వల్ల ప్రజలు బంగారమే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తూ అధికంగా కొనుగోళ్లకు దిగుతున్నారు.

బలహీన రూపాయి కారణమే..

రూపాయి విలువ పడిపోతుండటం బంగారం ధరల పెరుగుదలకు కారణమౌతోంది. 2012లో అంతర్జాతీయంగా 10 గ్రాముల బంగారం 1920 డాలర్లు ఉండేది. ఆ సమయంలో మనదేశంలో పసిడి ధర రూ. 35వేలు. డాలరుతో పోల్చితే రూపాయి విలువ 42గా ఉండేది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1500 డాలర్ల వద్దే ట్రేడవుతోంది. ప్రస్తుతం రూపాయి విలువ 71కి ఎగువకు పడిపోతుండటం వల్ల పుత్తడి ధరలు భారీగా పెరిగిపోతున్నాయని నిపుణులు అంటున్నారు.

ఇటీవల ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాలను పెంచింది. దీనివల్ల కూడా ధరలు పెరిగాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో ఇప్పటికే పసిడి కొనుగోల్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనితో పాటు గోల్డ్ ట్రేడెడ్ ఫండ్లలో పెట్టుబడులు కూడా పెరిగాయి.

Last Updated : Sep 27, 2019, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details