ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో ఓలా సంస్థ రికార్డు (Ola Electric record) సృష్టించింది. రెండు రోజుల్లో ఏకంగా రూ.1,100 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్ముడయ్యాయని (Ola Electric Scooter sales) సంస్థ సహ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ వెల్లడించారు. భారీ ఆర్డర్ల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచి విక్రయాల ప్రక్రియను నిలిపివేశారు. దీపావళి పర్వదినం సందర్భంగా నవంబరు 1న విక్రయాలు పునఃప్రారంభమవనున్నాయి.
ఆన్‌లైన్‌లో బుధవారం ఉదయం ఓలా స్కూటర్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. తొలి 24 గంటల్లో సెకనుకు 4 స్కూటర్ల చొప్పున రూ.600 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్ముడయ్యాయి. రెండో రోజు నాటికి ఆ విక్రయాలు రూ.1,100 కోట్ల విలువకు చేరుకున్నాయి. వాహన రంగ చరిత్రలోనే ఇదో రికార్డని భవీష్ అభిప్రాయపడ్డారు.