వాట్సాప్ ప్రతిపాదిస్తున్న నూతన ప్రైవసీ విధానాలను భారత్‌లో అమలు పరచకుండా అడ్డుకోవాలని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేదంటే వాట్సాప్‌తో పాటు దాని మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ను సైతం నిషేధించాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర ప్రసాద్‌కు లేఖ రాసింది.
ప్రమాదంలో గోప్యత..
నూతన నిబంధనలతో వ్యక్తిగత సమాచారం, నగదు చెల్లింపులు, లొకేషన్ సహా ఇతర కీలక సమాచారమంతా వాట్సాప్ చేతుల్లోకి వెళ్లిపోతుందని సీఏఐటీ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం వెంటనే స్పందించి వాట్సాప్, ఫేస్‌బుక్‌ను నిషేధించాలని కోరింది. ఇప్పటికే ఫేస్బుక్ చేతిలో 20కోట్ల మంది భారతీయులకు సంబంధించిన సమాచారం ఉందని.. దీంతో ఆర్థిక వ్యవస్థకు, దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని పేర్కొంది.