భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కొనుగోలుకు (Electric vehicles challenges) ఇటీవలి నెలల్లో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సైతం పలు రాయితీలతో ప్రోత్సహిస్తోంది. కొవిడ్ బారి నుంచి ఇప్పుడిప్పుడే తెప్పరిల్లుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఇది స్వల్పకాలంలో మేలు చేసే పరిణామమే. దీర్ఘకాలంలో ఈవీలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే ఎదురయ్యే సవాళ్లను గుర్తెరిగి వాటిని అధిగమించడానికి సిద్ధంగా ఉండాలి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కొత్త కార్లలో 26 శాతం ఈవీలేనని గణాంకాలు తెలుపుతున్నాయి. 2021 చివరికల్లా మొత్తం 50 లక్షల ఈవీలు విక్రయమవుతాయని అంచనా. 2021-22 ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలోనే భారత్‌లో 1.18 లక్షల ఈవీలు అమ్ముడుపోగా, అంతకు ముందు సంవత్సరం మొత్తంలో విక్రయించినవి 1.48 లక్షలు. ప్రస్తుతం మైక్రో చిప్‌ల కొరత ఉండబట్టి కానీ, లేకుంటే ఈవీల విక్రయం (Electric vehicle market) మరింత జోరెత్తేది. ఇంజిన్‌లో డీజిల్ లేదా పెట్రోలును మండించడం ద్వారా పరుగు తీసే సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) వాహనాలకు 2037కల్లా స్వస్తి చెప్పాలని ఐరోపా, అమెరికాల్లోని కార్ల కంపెనీలు నిశ్చయించాయి. కొన్ని కంపెనీలైతే 2030కే వాటి ఉత్పత్తిని నిలిపేస్తామని ప్రకటించాయి.
ఎన్నో అవకాశాలు
ఈవీల ఉత్పత్తి పెరగడానికి భారీ పెట్టుబడులు, సరఫరా గొలుసు వ్యవస్థ అవసరమవుతుంది. దీనివల్ల యావత్ ఆర్థిక వ్యవస్థకు మేలు కలిగే మాట నిజం. భారత్‌లో రాగల మూడు, నాలుగేళ్లలో ఈవీల కోసం 20,000 ఛార్జింగ్ స్టేషన్లను (Electric vehicle charging station) నెలకొల్పుతామని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. వీటిలో 10,000 స్టేషన్లను ఒక్క ఇండియన్ ఆయిల్ కార్పొరేషనే (ఐఓసీ) నెలకొల్పనున్నది. ఈవీల వినియోగం పెరిగితే సంప్రదాయ మోటారు వాహనాలు వెదజల్లే కర్బన ఉద్గారాలు నిలిచిపోయి వాతావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఈవీల కారణంగా ఉపాధి రంగంలో కొత్త తలనొప్పులు వచ్చిపడే అవకాశం లేకపోలేదు. ఆటొమొబైల్ రంగంలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం వాటిలో ముఖ్యమైనది. విధానకర్తలు దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం భారత జీడీపీలో 7.1 శాతం వాటాను ఆటొమొబైల్ రంగమే సమకూరుస్తోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా నాలుగు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. 2026కల్లా జీడీపీలో ఆటొమొబైల్ రంగ వాటాను 12శాతానికి, ఉద్యోగాల సంఖ్యను 6.5 కోట్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక సంప్రదాయ కారులో 25,000 విడిభాగాలు ఉంటాయి. వాటిలో ఎంతో కీలకమైన కదిలే విడిభాగాల సంఖ్య 1,000. అదే ఒక ఎలక్ట్రిక్ వాహనంలో కదిలే విడిభాగాల సంఖ్య కేవలం 20. అంటే ఈవీ నిర్వహణ ఖర్చు తగ్గడమే కాదు, విక్రయానంతర మరమ్మతు సేవలు కూడా తగ్గిపోతాయి. ఈవీలో 70శాతం విడి భాగాలు సంప్రదాయ ఇంజిన్‌కన్నా భిన్నమైనవి. కాబట్టి ఈవీల ఉత్పత్తి, నిర్వహణకు అత్యంత నైపుణ్యం గల ఉద్యోగులు అవసరమవుతారు. ప్రస్తుతం ఐసీఈ కార్ల విడిభాగాల్లో అత్యధికం భారత్‌లోనే ఉత్పత్తి (EV market in india by 2025) అవుతున్నా, ఈవీ విడిభాగాల్లో అత్యధికం మరి కొన్నేళ్లపాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పదు. ప్రస్తుతం భారత్‌లో సంఘటిత రంగంలో ఐసీఈ కార్ల విడిభాగాలను ఉత్పత్తి చేసే సంస్థలు 700 వరకు ఉండగా, అసంఘటిత రంగంలో 10,000 యూనిట్లమేర ఉన్నాయి. ఈవీల రంగప్రవేశంతో ఈ పరిశ్రమల్లో ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఆటో విడిభాగాల ఎగుమతి కూడా దెబ్బతినబోతున్నది. ప్రస్తుతం భారత్ ఏటా రూ.90,000 కోట్ల విలువైన ఆటో విడిభాగాలను ఎగుమతి చేస్తోంది. ఈవీ విడిభాగాల్లో అత్యధికాన్ని భారత్‌లోనే ఉత్పత్తి చేస్తే తప్ప ఉద్యోగ నష్టాన్ని నివారించలేం.
విద్యావిధానంలో మార్పులు అవసరం
అభివృద్ధి చెందిన దేశాల్లో నైపుణ్యాలు ప్రతి ఏడేళ్లకు ఒకసారి మారిపోతుంటాయి. ఉద్యోగులు ఆ మార్పునకు అనుగుణంగా కొత్త మెలకువలు నేర్చుకొంటూ ఉంటారు. కానీ, భారతీయులు ఒకసారి ఉద్యోగం వచ్చిందంటే ఇక జీవితంలో స్థిరపడి పోయినట్లేనన్న భావనతో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఉత్సుకత చూపడం లేదు. 32 ఏళ్లు పైబడిన వారిలో ఇలాంటి ధోరణి మరీ ఎక్కువ. ఇలాంటి దృక్పథాన్ని మార్చేలా మన విద్యావ్యవస్థను సిద్ధం చేయాలి. ఇకనైనా ప్రభుత్వం బట్టీ చదువులకు తావులేని 21వ శతాబ్ది విద్యావిధానాన్ని చేపట్టాలి. ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు పదును పెట్టుకునే మానవ వనరులను తీర్చిదిద్దాలి. ఉత్పాదకత ఆధారంగా వేతనాలు చెల్లించే పద్ధతిని చేపట్టాలి. కొత్త పని సంస్కృతిని, పని పరిస్థితులను ప్రవేశపెట్టాలి. జర్మనీలో మాదిరిగా పరిశ్రమలతో అనుసంధానమైన విద్యావిధానాన్ని చేపట్టాలి. ఆ విధానంలో లక్షల మంది పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుని విద్యాసంస్థల నుంచి బయటికొస్తారు. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ తమకు తాము పదును పెట్టుకుంటారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు తీసుకొచ్చే సవాళ్లను తట్టుకొని పురోగమించాలంటే భారత్ (Electric vehicle market in India) కూడా అలాంటి పద్ధతుల్ని అలవరచుకోక తప్పదు. ఈవీలు, వినూత్న టెక్నాలజీల కారణంగా రాబోయే అయిదు నుంచి ఏడేళ్లలో పెను మార్పులు సంభవించనున్నాయి. ఈ లోగా మన విద్యావ్యవస్థతోపాటు, పరిశ్రమల నిర్వహణలోనూ పూర్తిస్థాయిలో సంస్కరణలు తీసుకొచ్చి ఉద్యోగులకు నైపుణ్య శిక్షణను చేపట్టి కొత్త ప్రపంచంలోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలి. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు, వాణిజ్య, వ్యాపార వర్గాలు, ప్రజలు ఇప్పటి నుంచే అందుకు సన్నద్ధం కావాలి.