ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను 51 శాతానికన్నా తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ త్వరలో ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు సమాచారం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో.. ప్రభుత్వ రంగ జనరల్ బీమా సంస్థల విలీనం అంశమూ చర్చకు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
2018-19 బడ్జెట్ సమావేశాల్లోనే.. ప్రభుత్వ రంగ జనరల్ ఇన్స్యూరెన్స్ సంస్థలను విలీనం చేసి.. ఈ సంస్థను స్టాక్ మార్కెట్లో నమోదు చేయాలని ప్రతిపాదన వచ్చింది.
ప్రభుత్వ రంగ ఇన్స్యూరెన్స్ సంస్థలైన నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీల విలీన అంశం ముందుకు సాగే అవకాశముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతవారం తెలిపారు.
2019-20 బడ్జెట్ ప్రసంగంలో.. ప్రభుత్వం ఆర్థికేతర రంగాల్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే విధానాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు సీతారామన్. వాటిల్లో పెట్టుబడులను 51 శాతానికి తగ్గకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు.