తెలంగాణ

telangana

బాయ్‌కాట్‌ చైనాపై 'ఆటో'.. ఇటో తేల్చలేం

By

Published : Jun 27, 2020, 7:02 AM IST

సరిహద్దుల వద్ద చైనా వైఖరికి నిరసనగా భారత్‌లో 'బాయ్‌కాట్ ‌చైనా' ఉద్యమం నడుస్తోంది. చైనా బ్రాండ్లను కొనుగోలు చేయవద్దంటూ చాలామంది సామాజిక మాధ్యమాల్లో పిలుపునిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా మొబైళ్ల వరకే పరిమితమైన ఆ ఉద్యమం ఇపుడు వాహనాల వరకు చేరింది. చైనా తయారీ కార్ల కొనుగోలును రద్దు చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో గర్వంగా ఆ లేఖలను ప్రదర్శిస్తున్నవారూ ఉన్నారు. మరో పక్క, చైనా నుంచి విడిభాగాలను తీసుకొచ్చి తయారు చేసే వాహన కంపెనీలు మన దగ్గర ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం మీద తాజా పరిణామాల వల్ల ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న వాహన రంగంపై ఎంత ప్రభావం పడొచ్చు?

BOYCOTT CHINA
బాయ్‌కాట్‌ చైనా

భారత వాహన రంగం కరోనా కంటే ముందే కష్టాల్లో ఉంది. ఈ ఏడాది మొదట్లో జరిగిన వాహన ప్రదర్శనలో పలు కంపెనీలు పాల్గొనకపోవడమే అందుకు ఒక నిదర్శనం. ఇక కరోనా వచ్చాక పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఏప్రిల్‌లో సున్నా అమ్మకాలు నమోదయ్యాయి. ఉద్దీపన లేకుంటే.. పరిశ్రమ 25-45 శాతం మేర క్షీణతను నమోదు చేయవచ్చని వాహన తయారీదార్ల సంఘం సియామ్‌ అంచనా వేస్తోంది. ఇపుడు చైనా పరిణామాలు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

విడిభాగాలు అక్కడి నుంచే

మన భారత వాహన కంపెనీలు చైనా నుంచి నాణ్యమైన విడిభాగాలను అందుబాటు రేట్లకు కొనుక్కుని తెచ్చుకుంటున్నాయి. ఇపుడు ఒక్కసారిగా చైనాతో తెగదెంపులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైతే మాత్రం వాటికి స్వల్పకాలంలోనైనా ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ప్రత్యామ్నాయాలను దొరకబుచ్చుకోవడం అంత సులువు కాదు.

కరోనా కంటే ముందుగానే..

అయితే టాటా, మహీంద్రా, అశోక్‌ లేలాండ్‌, హీరో వంటి కొన్ని కంపెనీలు మాత్రం కరోనా కంటే ముందుగానే స్వయం సమృద్ధిపైన దృష్టి సారించాయి. చైనా సరఫరా వ్యవస్థ నుంచి బయటకు రావాలని అనుకున్నాయి. కాకపోతే కరోనా, తాజా పరిణామాలు ఆ కార్యక్రమాలకు మరింత బలాన్ని ఇవ్వొచ్చు.

భారత్‌లోకి వచ్చే పెట్టుబడులపైనా ప్రభావం

రెండేళ్ల కిందట చైనాతో అమెరికా చేపట్టిన వాణిజ్య యుద్ధంలో ఒక రకంగా భారత్‌ కూడా పాలు పంచుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా తన వాటాను పెంచుకున్న వెంటనే ఎఫ్‌డీఐ నిబంధనలను సవరించింది. ఈ కొత్త విధానాల వల్ల భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకున్న చైనా వాహన కంపెనీల ప్రణాళికలపై ప్రభావం పడింది. తాజా పరిణామాల వల్ల భారత్‌లోకి అడుగుపెట్టాలంటే చైనా కంపెనీలు ఆచితూచి వ్యవహరించాల్సిందే. ఇప్పటికే చాన్‌గన్‌ ఆటోమొబైల్‌ వేచిచూసే ధోరణిలో ఉంది. ఇక మరో చైనా కంపెనీ గ్రేట్‌ వాల్‌ మోటార్స్‌తో ఒప్పందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పక్కనపెట్టింది.

మొత్తం మీద భారత్‌, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతింటే మాత్రం ఇప్పటికిప్పుడు ఆ ప్రభావాన్ని తట్టుకునే స్థితిలో మన వాహన రంగం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ధరలు పెరుగుతాయ్‌

చైనాతో సంబంధాలు దెబ్బతింటే.. ముందుగా చైనా బ్రాండ్లతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఆ వచ్చే నష్టాలను వాహన కంపెనీలు భరించాల్సి ఉంటుంది. ఆ నష్టాలను పూడ్చుకునే విషయం పక్కనపెడితే.. ప్రత్యామ్నాయ దేశాలతో సరఫరా ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అపుడు కొత్తగా వచ్చే ఖర్చులనూ భరించాలి. దీనికంతటికీ సమయం పడుతుంది. అన్నిటికంటే మించి చైనా ఇచ్చే అందుబాటు ధరలకు అవి విడిభాగాలను ఇవ్వకపోవచ్చు. అపుడు ఎక్కువ మొత్తం చెల్లించి కొనుక్కురావాల్సి ఉంటుంది. అది వ్యయాలపై భారం చూపుతుంది. ఇది కాస్తా కార్ల ధరలపై ప్రభావం చూపొచ్చు. మరి ఇప్పటికే విక్రయాలు తక్కువగా ఉన్న కార్ల కంపెనీలు ధరలను పెంచితే.. అమ్మకాలపై ఆ ప్రభావం ఎంత ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ధరలు పెంచకపోతే మొదటికే మోసం.

భవిష్యత్‌ ఆశలపైనా నీళ్లు!

చైనాతో 'వాహన' అనుబంధం అక్కడితో ఆగలేదు. ప్రపంచ నిల్వల్లో 60 శాతం కోబాల్ట్‌ నిల్వలు చైనాలోనే ఉన్నాయి. లిథియం అయాన్‌ బ్యాటరీ ఉత్పత్తిలో తిరుగులేని ఆధిక్యాన్ని ఇది సొంతం చేస్తుంది. మరి భవిష్యత్‌లో విద్యుత్‌ వాహనాల(ఈవీ)ను మాత్రమే రోడ్లపై తిప్పాలన్న భారత్‌ కల నెరవేరాలంటే మన ఈవీలకు లిథియం అయాన్‌ బ్యాటరీలు తప్పనిసరి. ప్రస్తుతం కొన్ని సంప్రదాయ కంపెనీలు లెడ్‌ ఆసిడ్‌ బ్యాటరీలను వాడుతున్నా.. భవిష్యత్‌ లిథియందే. ఇపుడున్న పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటే మాత్రం.. భారత్‌లో ఈవీ రంగంలోకి పెట్టుబడులు అంత త్వరగా రావు. ఈవీల కల నెరవేరడానికి మరింత ఆలస్యం కావొచ్చు.

ఇదీ చూడండి: 'బాయ్‌కాట్‌ చైనా' సరే.. మరి ఈ అంకురాలకు దిక్కెవరు?

ABOUT THE AUTHOR

...view details