అర్బన్ కంపనీ, మేక్‌మై ట్రిప్, డంజో, హెల్తీఫైమీ, జొమాటో, రెడ్ బస్, ఐక్జిగో, మనీట్యాప్, మైఉప్చార్, బౌన్స్, రాజోర్‌పే, మేదాంత, విట్టీఫీడ్, ఎల్బీబీ, పోర్టర్, మీషో, డైలీ హంట్, 1ఎంజీ, పేటీఎం గేమ్స్...అన్నీ స్టార్టప్ సంస్థలు. కొన్నైతే ప్రత్యర్థులు కూడా. అయినా.. ఇవన్నీ ఒక విషయంలో ఏకతాటిపై నడుస్తున్నాయి. కరోనా సమయంలో.. మాస్కు, భౌతిక దూరం ఆవశ్యకతను తెలిపేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో మొదటిది.. సామాజిక మాధ్యమ ఖాతాలు, యాప్ ఐకాన్స్‌లో మార్పులు చేయడం.
ఈ స్టార్టప్‌ల వెనకుండి నడిపిస్తోంది అప్నా మాస్క్ కార్యక్రమం. ఇంట్లో తయారు చేసిన మాస్కులపై అవగాహన కల్పించేందుకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. అసలు ఏమిటీ అప్నా మాస్క్?
ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలనే లక్ష్యంతో 'స్టార్టప్వర్సెస్కొవిడ్' స్టార్టప్ కమ్యూనిటీ... సామాజిక మాధ్యమాల వేదికగా అప్నామాస్క్ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో వెయ్యి మంది వరకు సభ్యులు ఉన్నారు. ఇంట్లోనే తయారు చేసుకున్న మాస్కును ధరించటం, బయటికి వెళ్లిన క్రమంలో సురక్షితంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించటం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
# అప్నాదేశ్అప్నామాస్క్..
అప్నామాస్క్ కార్యక్రమంలో భాగంగా.. #అప్నాదేశ్అప్నామాస్క్ యాష్ ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు పలు అంకుర సంస్థల అధినేతలు. ఇంట్లోనే మాస్క్ తయారు చేసుకుని.. బయటికి వెళ్లిన ప్రతి సారి ధరించాలని కోరుతూ.. వీడియో సందేశాలు అందిస్తున్నారు. ఇందులో సెకోషియా ఇండియాకు చెందిన రాజన్ ఆనందన్, పేటీఎం- విజయ్ శేఖర్ శర్మ, ఇండిఫై- అలోక్ మిట్టల్ వంటి ఇతర సంస్థల ప్రముఖులు ఉన్నారు.
విద్యాబాలన్ అవగాహన..
సామాజిక మాధ్యమాల్లో అప్నామాస్క్ ప్రచార జోరును తెలుసుకున్న ప్రముఖ నటి విద్యాబాలన్ ఆ కార్యక్రమంలో చేరారు. ఇంట్లోనే మాస్క్ తయారు చేయటం ఎలాగో చెబుతూ.. అప్నాదేశ్, అప్నమాస్క్ యాష్ ట్యాగ్ ద్వారా వీడియో సందేశం అందించారు.