తెలంగాణ

telangana

వాహన మహారథులకు పద్మభూషణ్‌

దేశంలో మహీంద్రా ట్రాక్టర్లు, టీవీఎస్​లు తెలియని వారంటు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా దేశాన్ని ప్రభావితం చేసిన సంస్థలివి. ప్రజలకు దగ్గరయ్యేలా ఆయా సంస్థల అధిపతులు చేసిన కృషికి ప్రభుత్వం దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. మహీంద్రా గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టీవీఎస్‌ ఛైర్మన్‌ టి.వేణు శ్రీనివాసన్‌కు పద్మభూషణ్‌ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది.

By

Published : Jan 26, 2020, 8:15 AM IST

Published : Jan 26, 2020, 8:15 AM IST

Updated : Feb 18, 2020, 10:48 AM IST

mah tvs
మహీంద్రా, టీవీఎస్​

పొలం పనుల్లో రైతన్నలకు నేస్తం.. మహీంద్రా ట్రాక్టరు. పల్లె రహదారులకు చిరకాల బంధువు.. టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌. నగర జీవనానికే వాహనం పరిమితమైన రోజుల్లో.. గ్రామీణ ప్రజానీకానికి పరిచయమైన వాహనాలివి.

ఇప్పుడు ఆ వాహనాల కంపెనీల అధిపతులిద్దరికీ దేశంలోని మూడో అతిపెద్ద పౌర పురస్కారం లభించింది. మహీంద్రా గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టీవీఎస్‌ ఛైర్మన్‌ టి.వేణు శ్రీనివాసన్‌కు పద్మభూషణ్‌ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. ఇది వారికే కాదు.. దేశీయ వాహన పరిశ్రమకు లభించిన ఓ గొప్ప గౌరవంగా భావించవచ్చు.

ఆనంద్‌ మహీంద్రా

ఆనంద్ మహీంద్రా

ట్రాక్టర్ల కంపెనీగా పేరున్న మహీంద్రా గ్రూపును వివిధ వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టించిన ఘనత ఆనంద్‌ మహీంద్రాదే. అంతేకాదు.. ఆ కంపెనీల విజయవంతంలోనూ కీలక పాత్ర పోషించారు. 1981లో ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా మహీంద్రా యుజీన్‌ స్టీల్‌లో ఆనంద్‌ ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత 1989లో ప్రెసిడెంట్‌, ఎండీగా నియమితులయ్యారు. 1991లో ఎంఅండ్‌ఎంకు డిప్యూటీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 1997లో ఎండీగా, 2001లో వైస్‌ ఛైర్మన్‌గా పదోన్నతి పొందారు. 2012 ఆగస్టులో తన మామ కేశుబ్‌ మహీంద్రా నుంచి మహీంద్రా గ్రూపు ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకరించారు. అప్పటి నుంచి కొత్త వ్యాపారాల దిశగా గ్రూపును తీసుకెళ్లారు. వివిధ కంపెనీల కొనుగోళ్లలోనూ కీలక పాత్ర పోషించారు. మహీంద్రా గ్రూపు చరిత్రలో తనకంటూ ఓ విశిష్టతను సంపాదించుకున్న ఆయన.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అయితే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ హోదాలో కొనసాగనున్నారు. దేశీయ కార్పొరేట్లలో ఆనంద్‌ మహీంద్రాది ప్రత్యేక స్థానం. విభిన్న శైలి. ఒక పారిశ్రామికవేత్తగా కేవలం వ్యాపార అంశాలకే ఆయన ఎన్నడూ పరిమితం కాలేదు. సామాజిక, రాజకీయ అంశాలపైనా స్పందిస్తుంటారు. దాతృత్వంలోనూ ఆయన ముందుంటారు.

వేణు శ్రీనివాసన్‌

వేణు శ్రీనివాసన్‌

ఎన్నో సవాళ్లు, తీవ్ర పోటీ మధ్య టీవీఎస్‌ మోటార్‌ కంపెనీని నిలబెట్టడంలో వేణు శ్రీనివాసన్‌ చేసిన కృషి అంతాఇంతా కాదు. తద్వారా దేశంలోని మూడు అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ కంపెనీగా టీవీఎస్‌ను తీర్చిదిద్దారు. టీవీఎస్‌ గ్రూపు వ్యవస్థాపకుడు టి.వి.సుందరం అయ్యంగర్‌కు వేణు శ్రీనివాసన్‌ మనవడు. 1979లో సుందరం క్లేటాన్‌లో మేనేజింగ్‌ డైరక్టరుగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత టీవీఎస్‌ మోటార్‌ కంపెనీకి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్లాంటు ఆధునీకరణ, కొత్త సాంకేతికతలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టాలను చవిచూసిన కంపెనీని వృద్ధి పథం వైపు తీసుకెళ్లారు. టీవీఎస్‌ విక్ట్టర్‌ బైక్‌ విడుదల ద్వారా ఇందుకు బాటలు పరిచారు. వేణు శ్రీనివాసన్‌ టాటా సన్స్‌లో బోర్డు సభ్యుడిగా ఉన్నారు. టాటా ట్రస్ట్స్‌కు వైస్‌ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసన్‌ సర్వీసెస్‌ ట్రస్ట్‌ ద్వారా ఆయన సామాజిక సేవా కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి:బీఎస్​ఎన్​ఎల్ 'రిపబ్లిక్​ డే ఆఫర్​' అదిరింది గురూ!

Last Updated : Feb 18, 2020, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details