మోదీ నిర్ణయంతో అమెరికా రైతులకు కష్టాలు అమెరికా కాలిఫోర్నియా సెంట్రల్ వ్యాలీలో వేలాది ఎకరాల్లో దట్టమైన బాదం చెట్లు విస్తరించి ఉంటాయి. 7 వేల మందికిపైగా రైతులకు బాదం సాగే ప్రధాన ఆదాయ వనరు. దాదాపు లక్షా 4 వేల మందికిపైగా ఉపాధి కల్పిస్తోందీ రంగం.
అక్కడి నుంచి వేల మైళ్ల దూరంలో ఉన్న భారత్‌లో ఈ బాదంకు మంచి డిమాండ్ ఉంది. అమెరికా నుంచి భారీ స్థాయిలో బాదం దిగుమతి చేసుకుంటోంది భారత్. వంటలు, శీతల పానీయాలు, ఐస్ క్రీమ్, ఇతరత్రాలలో వీటిని వినియోగిస్తారు.
''ప్రపంచవ్యాప్తంగా బాదం ఉత్పత్తి, సరఫరాలో కాలిఫోర్నియా అగ్రగామి. ప్రపంచంలో ఉత్పత్తయ్యే బాదంలో 82 శాతం ఇక్కడి సెంట్రల్ వ్యాలీలోనే సాగవుతోంది.''
-డేనియల్ వీన్స్ట్రా, ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా
భారత్‌లో అంతటి మార్కెట్ ఉన్న అమెరికా బాదం పరిశ్రమ భవిష్యత్తు అనిశ్చితిలో మునిగిపోయింది. కారణం.. బాదం, యాపిల్ సహా 28 అమెరికా ఉత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాలు విధించడమే. జూన్ 16 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి.
వాణిజ్య పరంగా ప్రాధాన్య దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగించడం ఈ సుంకాల పెంపునకు ఓ కారణం. ఇటీవల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా పన్నులు పెంచడం మరో కారణం.
మోదీ నిర్ణయంతో భారత మార్కెట్‌లో బాదం, వాల్‌నట్స్, యాపిల్స్ మరింత ప్రియం కానున్నాయి. ఫలితంగా.. అమెరికా ఎగుమతిదార్లపై భారం పడుతోంది. అమెరికా ఎగుమతులు తగ్గుముఖం పడతాయి. ఇదే ప్రధాన ఆదాయ వనరుగా జీవనం సాగిస్తున్న ఎంతోమంది అమెరికా రైతుల భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. పంట కాలం సమీపిస్తున్నందున సుంకాల పెంపు తగ్గించేలా భారత్‌ను అభ్యర్థించాలని మొరపెట్టుకుంటున్నారు.
''బాదం పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. కానీ.. అమెరికానే నెం.1 మార్కెట్. దాదాపు 30 శాతం బాదం అమెరికాలో ఉంచుతాం. మిగిలినది ప్రపంచదేశాలకు ఎగుమతి చేస్తాం. భారత్ మా మొట్టమొదటి ప్రాధాన్య దిగుమతిదారు. అక్కడ మంచి డిమాండ్ ఉన్న బాదంపై ఇలాంటి సుంకాల పెంపు బాధాకరం.''
- డేనియల్ వీన్స్ట్రా, ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా
అమెరికా బాదంకు మంచి మార్కెట్ ఉన్న చైనాలోనూ వాణిజ్య వివాదాల నడుమ 50 శాతం సుంకాలను విధించారు జిన్‌పింగ్. ఫలితంగా.. ఆ దేశానికి ఎగుమతులు మూడో వంతు తగ్గిపోయాయి. అమెరికా బాదం పరిశ్రమ కుదేలైంది.
650 మిలియన్ డాలర్ల మార్కెట్...
కాలిఫోర్నియా నుంచి భారత్‌కు దిగమతయ్యే బాదం మార్కెట్ విలువ సుమారు.. 650 మిలియన్ డాలర్లు. చైనాకు 2017-18లో చైనా, హాంగ్‌కాంగ్‌లకు ఇది 549 మిలియన్ డాలర్లుగా ఉంది.
అమెరికాలోని 'జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్(జీఎస్‌పీ)' కింద భారత్ ప్రాధాన్య దేశాల జాబితాలో ఉండేది. ఈ జాబితా నుంచి భారత్‌ను తొలగించగా 5.6 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇంతకుముందు ఈ ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు లేవు.