భారతీయ ఆహార పంపిణీ, రెస్టారెంట్ డిస్కవరీ వేదిక జొమాటో.. భారత్‌లోని ఉబర్ ఈట్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. బదులుగా తమ వ్యాపారంలో 9.99 శాతం వాటాను (స్టాక్ డీల్) ఉబర్‌కు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ ఒప్పందంలో భాగంగా ఉబర్ ఈట్స్ భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేస్తుంది. డైరెక్ట్ రెస్టారెంట్లు, డెలివరీ భాగస్వాములు, ఉబర్ ఈట్స్ యాప్ వినియోగదారులను జొమాటో ప్లాట్‌ఫామ్‌కు బదిలీచేయనుంది. ఈ ప్రక్రియ నేటి నుంచే అమలు కానుందని జొమాటో వెల్లడించింది.
"భారతదేశంలోని 500కు పైగా నగరాల్లో ఆహార పంపిణీ వ్యాపారాన్ని విస్తరించినందుకు మేము గర్విస్తున్నాం. ఉబర్ ఈట్స్ వ్యాపారం సొంతం చేసుకోవడం మా స్థానాన్ని మరింత గణనీయంగా బలపరుస్తుందని నమ్ముతున్నాం."
- దీపిందర్ గోయెల్, జొమాటో సీఈఓ
అలీబాబా అనుబంధ సంస్థ యాంట్ ఫైనాన్సియల్ నుంచి 3 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ వద్ద జొమాటో 150 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ ఒప్పందం కుదరడం గమనార్హం.