ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించనుందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలపై సదరు యాజమాన్యాలు ఇప్పటివరకూ స్పందించకపోవటం ఈ చర్చకు తెరలేపగా.. కేంద్రం చెప్పిన గడువు తేదీ ముగుస్తుండటం వల్ల ఇవి నిషేధిత యాప్‌ల జాబితాలోకి వెళ్లిపోతాయా అనే డైలమా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ యాప్ లను ఎక్కువగా వినియోగించే వారిలో తెలియని ఆందోళన నెలకొంది. ఫేస్బుక్, ట్విట్టర్ల సేవలు 2006లో ప్రారంభం కాగా.. ఇన్స్టాగ్రామ్ 2010 నుంచి సేవలు అందిస్తోంది. ప్రత్యేకించి ఫేస్‌బుక్‌ను కేవలం భారత్ లోనే 29 కోట్ల మంది వినియోగిస్తున్నారు. ప్రపంచంలోనే ఇంత పెద్దసంఖ్యలో ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న దేశాలలో మనది అగ్రస్థానం.
ఇంతమందితో అనుబంధాన్ని పెనవేసుకున్న ఫేస్బుక్.. ఒక వేళ నిషేధానికి గురైతే ఎలా అన్న సందేహాలు చాలా మందిలో నెలకొన్నాయి. ప్రత్యేకించి ఫేస్బుక్ వేదికగా.. కథలు, కవితలు, రచనలు, విశ్లేషణలు, అభిప్రాయాలను పంచుకునే చాలా మంది సంవత్సరాల తరబడి తాము రాసుకున్న సమాచారాన్ని కోల్పోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. కొంతమంది పెన్ డ్రైవ్ ల్లో తమ విలువైన డేటాను నిక్షిప్తం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం మొత్తం ఏదైనా ఒక ఆర్కైవ్ ఫైల్ రూపంలో దాచుకునే అవకాశాన్ని ఎప్పుడో కల్పించింది. ఫేస్బుక్ వాడే వినియోగదారులు.. కొంత కాలం పాటు బ్రేక్ తీసుకోవాలని అనుకున్నా.. ఈ ప్లాట్ ఫాం ను వదిలేయాలని భావించినా వారికి ఉపయుక్తమయ్యేలా కల్పించిన ఈ ఆప్షన్ ప్రస్తుతం మోస్ట్ సెర్చింగ్ జాబితాలో ఉంది.