క్యాంపస్ ప్లేస్‌మెంట్లు లేవు, పోటీ పరీక్షలు లేవు... ఇదీ చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుల పరిస్థితి. ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆన్‌లైన్లో షేర్లు కొని, అమ్ముకుంటే లాభం వస్తుందేమో... ఇది కొందరి ఆలోచన. ట్రేడింగ్ ఖాతా, డీమ్యాట్ ఖాతా ఆన్‌లైన్లోనే తెరిచి వెంటనే ట్రేడింగ్ మొదలుపెట్టవచ్చు. ఈ వెసులుబాటు యువతను స్టాక్ మార్కెట్ వైపు ఆకర్షిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లోకి కొత్త మదుపరులు వస్తున్నారు. ఇందులో యువతరం అధికంగా కనిపిస్తోంది. గత నాలుగు నెలలుగా పెరుగుతున్న వర్తక పరిమాణం, కొత్త ఖాతాల సంఖ్య... ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యువత ఎందరో ఎంతో కొంత సొమ్ముతో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడం ఇటీవలి కాలంలో పెరిగింది. గత నాలుగు నెలల్లో పెద్ద సంఖ్యలో ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు 'ఓపెన్' అయ్యాయి. ట్రేడింగ్ పరిమాణం (వాల్యూమ్స్) కూడా పెరగటం ఆసక్తికరమైన విషయం.
కరోనా వైరస్ విస్తరించటం, ఫలితంగా దేశవ్యాప్తంగా 'లాక్‌డౌన్' విధించటం, సడలించినా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో బయటతిరగటం సాధ్యం కావటం లేదు. దీనివల్ల స్టాక్ మార్కెట్లోకి కొత్త మదుపరులు, ముఖ్యంగా యువకులు అధికంగా వస్తున్నట్లు భావిస్తున్నారు.
గతంలో ఇలా
డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతా తెరవాలంటే స్టాక్‌బ్రోకింగ్ సంస్థను సంప్రదించి పాస్‌పోర్ట్ ఫొటోలు, కేవైసీ (నో యువర్ కస్టమర్) పత్రాలతో పాటు దాదాపు 15- 20 పేజీలు ఉండే దరఖాస్తును సమర్పించాల్సి వచ్చేది. ఆ తర్వాత రెండు, మూడు రోజులకు గానీ ఖాతా సిద్ధమయ్యేది కాదు. ఇప్పుడలా కాదు, ఆన్‌లైన్లో వెంటనే ఖాతా తెరిచి ట్రేడింగ్ చేయవచ్చు.
జెరోధాలో..
- రెండు నెలల్లో సంస్థకు లభించిన కొత్త ఖాతాలు: 3 లక్షలు
- వీరిలో మొదటిసారిగా మార్కెట్లో అడుగుపెట్టినవారు 65 శాతం
- వీరి వయసు 30 ఏళ్ల లోపే
- ఆధారం: జెరోధా సీఈఓ నితిన్ కామత్
5 పైసా.కామ్‌లో
- మార్చిలో 60 వేల కొత్త ఖాతాలు వచ్చాయి.
- ఇందులో తొలిసారి మార్కెట్‌లోకి వచ్చిన వారు 80 శాతం
ప్రస్తుతం ఇలా
జెరోధా, 5పైసా, అప్‌స్టాక్స్... వంటి టెక్నాలజీ ఆధారిత డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థల ప్రవేశంతో తక్కువ ఖర్చులో ఖాతా తెరవటం, ట్రేడింగ్ చేయటం సులువైంది.
- సంప్రదాయ బ్రోకింగ్ సంస్థలైన మోతీలాల్ ఓస్వాల్, షేర్‌ఖాన్, ఏంజెల్ బ్రోకింగ్, ఐసీఐసీఐ డైరెక్ట్, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ... ఎప్పటి నుంచో ఆన్‌లైన్ ట్రేడింగ్ సదుపాయాన్ని ఇస్తున్నాయి. ఏ షేర్లు కొనాలనే సలహాలూ ఈ సంస్థలు ఇస్తాయి. వీటిలో లావాదేవీలు నిర్వహించే మదుపరుల సంఖ్య కూడా పెరుగుతోంది.