తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐఆర్‌డీఏఐలో కీలక నిర్ణయాలు ఆలస్యం! - ఆరోగ్య బీమా

కొవిడ్ మహమ్మారి వేళ బీమా రంగం ప్రాధాన్యత అధికమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కీలకమైన భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉండటం సమస్యగా మారింది. బీమా సంస్థల సమస్యలకు సానుకూల పరిష్కారం చూపడంలో జాప్యం ఎదురవుతోంది.

IRDAI
ఐఆర్‌డీఏఐ

By

Published : Aug 11, 2021, 5:00 AM IST

ఆరోగ్య, జీవిత బీమా రంగాలపై కొవిడ్‌-19 రెండో దశ ఎంతో ప్రభావం చూపింది. ఆరోగ్య బీమా క్లెయింలు అనూహ్యంగా పెరగ్గా, జీవిత బీమా క్లెయింలనూ బీమా సంస్థలు అధికంగానే పరిష్కరించాయి. బీమా రంగం ప్రాధాన్యం పెరిగిన ప్రస్తుత తరుణంలో ఎంతో కీలకమైన భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉండటం సమస్యగా మారింది. ఈ ఏడాది మే 6న సుభాశ్‌ చంద్ర కుంతియా పదవీ విరమణ చేసినప్పటి నుంచి మూడు నెలలుగా ఈ పదవిలో ఎవరినీ నియమించలేదు. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు పాలసీదారులకు మేలు చేశాయి. సార్వజనీన పాలసీలను తీసుకురావడం, బీమా పాలసీలను కరోనాకు వర్తింపచేయడం, కరోనా రక్షక్‌, కరోనా కవచ్‌ పాలసీలను ఆవిష్కరించేందుకు నియంత్రణ సంస్థ ఎంతో కృషి చేసింది. కొవిడ్‌ మూడోదశ ప్రబలనుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా కూడా బీమా రంగానికి కీలకమైన ఐఆర్‌డీఏఐకు ఇంతకాలం అధిపతి లేకుండా ఉండటం.. సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇదే తొలిసారి.

1999లో ప్రారంభం

దేశంలో బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నియంత్రిస్తున్నట్లే.. బీమా సంస్థలను నియంత్రించేందుకు, బీమా రంగంలో విధాన నిర్ణయాలు, పాలసీలకు అనుమతిలాంటివి ఇచ్చేందుకు పూర్తి స్వతంత్ర వ్యవస్థగా ఐఆర్‌డీఏఐ 1999లో హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి బీమా రంగంలో విప్లవాత్మక మార్పులకు ఈ సంస్థ కారణమైంది. సాధారణంగా ఛైర్మన్‌ పదవి ఖాళీ అవుతుందనగా, 2-3 నెలల ముందే కొత్త ఛైర్మన్‌ నియామక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. కానీ, మే మొదటివారంలో పదవీ విరమణ ఉంటే, ఏప్రిల్‌ 30న నోటిఫికేషన్‌ జారీచేయడం వల్లే ఎంపిక ఆలస్యమవుతోందని చెబుతున్నారు. ఈ పదవికి 30కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇందులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో పాటు, కొన్ని ప్రైవేటు బీమా సంస్థల్లో పనిచేసిన ఎండీ, సీఈఓ స్థాయి అధికారులూ ఉన్నారని తెలుస్తోంది. ప్రభుత్వ రంగ భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్లకూ, సాధారణ బీమా సంస్థ సీఎండీలకూ ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉండేది. సవరించిన నిబంధల ప్రకారం సెక్రటరీ స్థాయి అధికారి ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ లెక్కన ప్రభుత్వ బీమా సంస్థల నుంచి ఎల్‌ఐసీ ఛైర్‌పర్సన్‌ ఎంఆర్‌ కుమార్‌ ఒక్కరే అర్హులు. ఎల్‌ఐసీలో కుమార్‌ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించినందున, ఆయన ఐఆర్‌డీఏఐ పోటీలో లేరు.

ఈ అంశాలపై ప్రభావం

బీమా రంగంపై కొవిడ్‌ విపరీతమైన ప్రభావాన్ని చూపించింది. ఈ పరిణామాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, బీమా సంస్థల సమస్యలకు సానుకూల పరిష్కారం చూపించడంలో ఛైర్మన్‌ కీలకంగా వ్యవహరిస్తారు. గత 3 నెలలుగా ఈ పనులు జరగడం లేదు. బీమా సంస్థల సాధారణ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా ఐఆర్‌డీఏఐ అంతర్గత వ్యవస్థ పనిచేస్తున్నప్పటికీ.. ఛైర్మన్‌ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కష్టంగా మారుతున్నాయని పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి:పల్లె ముంగిట బీమా- నమూనా గ్రామాల అవతరణ

ABOUT THE AUTHOR

...view details