చైనా.. భారత్‌లోకి సరిహద్దుల్లోంచే కాదు.. డిజిటల్ మార్గంలోనూ చొరబడాలని చూస్తోంది. అందుకే చైనాకు డిజిటల్‌గా చెక్ పెట్టే పని చేసింది భారత్. దేశ రక్షణకు, భద్రతకు ముప్పుగా పరిణమించిన చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించింది.
నిషేధంతో ఏంటి ఉపయోగం?
సరిహద్దుల్లో చైనా దూకుడుకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే చైనా వస్తువులను నిషేధించాల్సిందేనని పలు వర్గాల నుంచి ఇటీవల కాలంలో డిమాండ్లు ఊపందుకున్నాయి. అయితే వస్తువులను నిషేధించడం కన్నా యాప్‌లను నిషేధిస్తేనే భారత ఆర్థిక వ్యవస్థకు మేలు అని కొంతమంది నిపుణులు చెబుతూ వస్తున్నారు. వస్తువులను నిషేధిస్తే మన ఎగుమతులపైనా ప్రభావం పడుతుంది. యాప్‌లను నిషేధిస్తే సమాచార తస్కరణ ఆగిపోవడమే కాక చైనా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం ఉంటుంది.
చైనాకు ఎలా నష్టం?
భారత్‌లో ప్రధానంగా నాలుగు రకాల చైనా యాప్‌లు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి. ఎకానమిక్ యాప్‌లు, వ్యానిటీ యాప్‌లు, న్యూసెన్స్ యాప్‌లు, చైనా గురించి ఊదరగొట్టే యాప్‌లు- ఈ నాలుగు రకాల్లో కనీసం మూడు రకాలను నిషేధించాలని కొంత మంది నిపుణులు కొన్నాళ్లుగా చెబుతున్నారు. బైదూ లాంటి యాప్‌లు.. చైనాకు డిజిటల్ సిల్క్ రూట్ లాంటివి. భారత మార్కెట్‌లో వాటిపై ఎలాంటి ప్రభావం పడినా ఆ కంపెనీల విలువపై భారీ ప్రభావం కనిపిస్తుంది.
టిక్‌టాక్ యాప్‌నే తీసుకుంటే దాదాపు 30 శాతం వినియోగదారులు భారత్ నుంచే ఉన్నారు. పదిశాతం ఆదాయం ఇక్కడి నుంచే వస్తోంది. ఈ ఆదాయమంతా టిక్‌టాక్ కోల్పోక తప్పదు. అది అంతిమంగా చైనా ఆర్థిక వ్యవస్థకు ఎంతోకొంత నష్టం కలిగిస్తుంది. భారత్ అనుసరించిన ఈ మార్గాన్ని మరికొన్ని దేశాలు కూడా అనుసరించే అవకాశం ఉంది. దీంతో చైనాకు మరింత నష్టం కలగక తప్పదు.