What is Economic Survey: కొత్త ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పద్దు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు (జనవరి 31న) పార్లమెంట్ ఉభయ సభల ముందుకు ఆర్థిక సర్వేను(2020-2021) తీసుకురానున్నారు.
ఆర్థిక సర్వే అంటే?
Budget Survey 2022: ఆర్థిక సర్వే.. ఆర్థిక వ్యవస్థలో పలు రంగాల పరిస్థితిని తెలియజేస్తుంది. తద్వారా మొత్తం మీద ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది తెలుస్తుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టడానికి చేయాల్సిన విధాన మార్పులతో పాటు.. ప్రభుత్వం ఏం చేయాలన్నదానిపైనా సూచనలు చేస్తుంది.
ఎవరు తయారు చేస్తారు?
ఆర్థిక సర్వేను ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ), ఆయన బృందం తయారు చేస్తుంది. పార్లమెంటు ఉభయ సభల్లో బడ్జెట్‌కు ఒక రోజు ముందు దీనిని ప్రవేశపెడతారు. 1950-51లో తొలిసారిగా ఆర్థిక సర్వే తీసుకువచ్చారు. 1964 వరకు దీనిని బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టారు. అయితే ఆ తర్వాత దీనిని విభజించి, విడిగా ఇస్తున్నారు.
ఈ సారి కొత్త సీఈఏ..
బడ్జెట్ సమావేశాలకు కొద్దిరోజులు ముందే ప్రధాన ఆర్థిక సలహాదారుగా(సీఈఏ) డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్ నియమితులైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇక బడ్జెట్ తయారీ నేపథ్యంలో తక్షణమే నాగేశ్వరన్ విధుల్లో చేరతారని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రధాన ఆర్థిక సలహాదారులగా పని చేసిన కృష్ణమూర్తి సుబ్రమణియన్ పదవీకాలం గతేడాది డిసెంబరులోనే ముగిసింది. నాగేశ్వరన్ ఆయన స్థానాన్ని భర్తీ చేశారు.