పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన 18 కోట్ల మంది ఖాతాదారుల (PNB Server Vulnerability) సమాచారం గత ఏడు నెలలుగా బహిర్గతంగా ఉన్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ ఎక్స్9 వెల్లడించింది. బ్యాంక్ సర్వర్‌లో లోపం ఉండటమే అందుకు కారణమని పేర్కొంది. బ్యాంక్‌కు సంబంధించిన డిజిటల్ బ్యాంకింగ్‌కు వ్యవస్థ మొత్తాన్ని యాక్సెస్ చేసే అవకాశాన్ని (PNB Server Vulnerability) సర్వర్‌లోని లోపం కల్పించిందని ఆ సంస్థ తెలిపింది. అయితే, సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన మాట వాస్తవమే అయినప్పటికీ.. ఖాతాదారులకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కలేదని పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా సర్వర్‌ను షట్‌డౌన్ చేసినట్లు తెలిపింది.
"పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన 18 కోట్ల ఖాతాదారుల సమాచారం (PNB Server Vulnerability) గత ఏడు నెలలుగా బహిర్గతంగా ఉంది. ఖాతాదారుల వ్యక్తిగత సమచారం, ఆర్థిక వివరాలు, నగదు విషయంలో ఆ బ్యాంక్ రాజీ పడింది. సైబర్ ఎక్స్9 చెప్పిన తర్వాతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేల్కొంది. ఇదే విషయాన్ని సీఈఆర్టీ-ఇన్, ఎన్‌సీఐఐపీసీకి కూడా తెలియజేశాం" అని సైబర్ ఎక్స్9 వ్యవస్థాపకుడు, ఎండీ హిమాన్షు పాతక్ తెలిపారు. సైబర్ దాడులకు వీలు కల్పించే విధంగా ఈ లోపం ఉందని, అడ్మిన్ యాక్సెస్ సైతం అందించేవిధంగా ఈ లోపాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. నవంబర్ 19న పీఎన్‌బీ చర్యలు చేపట్టినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది.