ఏజీఆర్ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుతో పీకల్లోతు కష్టాలు కూరుకుపోయిన వొడాఫోన్-ఐడియా సంస్థ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏజీఆర్ ఛార్జీల చెల్లింపు విషయంలో తమకు ఎలాంటి ఊరట లభించకపోతే సంస్థను మూసివేయక తప్పదని ఆవేదన వ్యక్తంచేశారు. దిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు బిర్లా.
"ప్రభుత్వ ఉపశమనం లేనప్పుడు .. మేము దుకాణం మూసుకోవాల్సి ఉంటుంది."
- కుమార మంగళం బిర్లా, వొడాఫోన్-ఐడియా ఛైర్మన్
ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే.. బిర్లా గ్రూప్ మున్ముందు వొడాఫోన్-ఐడియాలో ఎలాంటి పెట్టుబడులు పెట్టదని సంకేతాలు ఇచ్చారు బిర్లా. ఫలితంగా సంస్థ షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి.
ఎందుకింత కష్టం..?
స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు, లైసెన్స్ ఫీజులను కలుపుకొని ఏజీఆర్(అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ) ఛార్జీలుగా చెబుతారు. వీటిల్లో 3-5శాతం స్పెక్ట్రం వినియోగ చార్జీలు, 8 శాతం లైసెన్స్ ఫీజుగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌కు చెల్లించాలి.
1999 తర్వాత ఆదాయంలో వాటా విధానం (రెవెన్యూ షేరింగ్) కింద ఏజీఆర్ ఛార్జీలను ప్రవేశపెట్టారు. ఈ ఛార్జీలను లెక్కగట్టే విధానంపై వివాదం రాజుకొంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. టెలికాం సంస్థలన్నీ కేంద్రానికి ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు భారతీ ఎయిర్టెల్ గ్రూప్- రూ.62,187.73 కోట్లు, వొడాఫోన్ ఐడియా- రూ.54,183.9 కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్-ఐడియా రూ.50,921 కోట్ల నష్టాలను ప్రకటించింది.
ఇదీ చూడండి:సంపన్నుల కోసం శాంసంగ్ లగ్జరీ స్క్రీన్.. ధర రూ.12 కోట్లు!