తెలంగాణ

telangana

ETV Bharat / business

Union Budget 2022: బడ్జెట్​లో 'ఎలక్ట్రిక్'​కు మరింత కిక్​! - యూనియన్​ బడ్జెట్​ 2022

Union Budget 2022: పెట్రోల్​, డీజిల్​ ధరలు భారీగా పెరగడం వల్ల దేశంలో ఎలక్ట్రిక్​ వెహికిల్స్​కు ఆదరణ పెరిగింది. భారత్​ నిర్దేశించుకున్న పర్యావరణ లక్ష్యాల సాధనకు ఈ రంగాన్ని ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్​లో ఈవీ రంగానికి కేంద్రం ఎంత కేటాయిస్తుంది అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Union Budget 2022
కొత్త బడ్జెట్​తో ఎలక్ట్రిక్​కు మరింత కిక్​!

By

Published : Jan 28, 2022, 5:43 PM IST

Updated : Jan 28, 2022, 7:56 PM IST

Union Budget 2022: భారత్‌లో గత ఏడాది విద్యుత్తు వాహన (Electrc Vehicles - EV) రంగం భారీగా పుంజుకుంది. దేశంలో ఈవీల వాడకాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేమ్‌-2 (FAME-II) (ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌) సబ్సిడీ పథకం దీనికి మరింత దోహదం చేసింది. ఓ ప్రముఖ నివేదిక ప్రకారం.. దేశంలో వచ్చే దశాబ్ద కాలంలో ఈ రంగం ఏటా 90 శాతం వృద్ధితో దూసుకెళ్తుందని అంచనా. 2030 నాటికి ఈ పరిశ్రమ విలువ రూ.11 లక్షల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు.

పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరల నేపథ్యంలో వినియోగదారులు ఈవీలవైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు భారత్‌ నిర్దేశించుకున్న పర్యావరణ లక్ష్యాల సాధనకు ఈ రంగాన్ని ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో దేశ వాహన రంగాన్ని ఈవీవైపు తిప్పడం అనివార్యం. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించింది. అదే దిశలో బడ్జెట్‌-2022 కేటాయింపుల్లోనూ ఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరమూ ఉంది.

ఛార్జింగ్‌ పాయింట్లు పెరిగితే..

ఈవీ రంగం పుంజుకోవాలంటే అధిగమించాల్సిన మొట్టమొదటి సమస్య ఛార్జింగ్‌ మౌలికవసతులు. ఛార్జింగ్‌ పాయింట్లు ఎక్కువగా ఏర్పాటైతే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రవ్‌ మోటార్‌ వ్యవస్థాపకులు, సీఈఓ అరుణ్‌ సన్నీ తెలిపారు. ప్రతి 3 కిలోమీటర్లకు ఒక చోట ఛార్జింగ్‌ పాయింట్‌ పెట్టాలని డిమాండ్‌ ఉంది. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ప్రతి 25 కిలోమీటర్లకు ఒకటి ఏర్పాటు చేయాలనీ వినిపిస్తోంది. అలాగే ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆకాంక్ష కూడా వ్యక్తమవుతోంది. ఇందుకు ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం అవసరమని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఆ దిశగా బడ్జెట్‌లో విధానపరమైన నిర్ణయాలు ఉండాలని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

ఈవీ ఛార్జింగ్​ పాయింట్లు

మరోవైపు నివాస సముదాయాలు, హౌసింగ్‌ కాంప్లెక్సులు, కమర్షియల్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఛార్జింగ్‌ స్టేషన్లకు భారీ రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసే ఛార్జింగ్‌ కేంద్రాలకు అయ్యే వ్యయంలో 30 శాతం వరకు కేంద్రం రాయితీ ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కావాల్సిన భూమి విషయంలో ప్రభుత్వ భూములను నగదీకరించే (Monetize) విషయాన్ని పరిశీలించాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. మరోవైపు ఛార్జింగ్‌ కేంద్రాలకు కావాల్సిన విద్యుత్తును పునరుత్పాదక వనరుల నుంచి సమకూర్చుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన పరికరాలు, యంత్రాల కొనుగోలుకు కూడా ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు.

బ్యాటరీల తయారీకి బాట..

ఈవీల విజయం పూర్తిగా బ్యాటరీలపైనే ఆధారపడి ఉంది. ఈ రంగం ఇంకా వెనుకబడి ఉండడానికి కారణం కూడా బ్యాటరీలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఉన్న బ్యాటరీలు అందుబాటులో లేకపోవడం ఈవీలకు ఒక పెద్ద అడ్డంకి. దీన్ని అధిగమించాలంటే బ్యాటరీ స్వాపింగ్‌ సాంకేతికతే పరిష్కారం. ఛార్జింగ్‌ స్టేషన్లను ఈ సాంకేతికతతో ఆధునికీకరించగలిగితే.. ఒక పెద్ద సమస్యను అధిగమించినట్లే. ఫేమ్‌-II సబ్సిడీలలో ఈ బ్యాటరీ స్వాపింగ్‌ పరిశ్రమకు కూడా చేర్చాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

ప్రియారిటీ సెక్టార్‌ లెండింగ్‌ హోదా...

ఎక్కువ ధర, తక్కువ రుణ వసతి.. ఈవీల పరుగుకు ఎదురవుతున్న మరో అడ్డంకి. ఈ రంగానికి రుణాలు అందించడంలో ప్రాధాన్యం గనక ఇస్తే మరింత వేగంగా రోడ్లపైకి ఈవీలు చేరతాయి. అందుకోసం ఈ రంగాన్ని 'ప్రయారిటీ సెక్టార్‌ లెండింగ్‌' (పీఎస్‌ఎల్‌) కిందకు తీసుకురావాలని రెవ్‌ఫిన్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకులు, సీఈఓ సమీర్‌ అగర్వాల్‌ కోరారు. వినియోగదారులతో పాటు ఈ రంగంలో పుట్టుకొస్తున్న పరిశ్రమలకు రుణాలను అందజేసే ప్రక్రియను సరళీకరించాలి. ఈ నేపథ్యంలో మరింత వేగంగా, సులభంగా రుణాలు అందేలా బడ్జెట్‌లో విధానపరమైన నిర్ణయాలు ఉండాలని ఆశిస్తున్నారు.

సమగ్ర పీఎల్‌ఐ పథకం..

కేంద్రం ఇటీవల వాహన రంగానికి రూ.25,938 కోట్లతో కూడిన పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. నిలదొక్కుకున్న భారీ పరిశ్రమలకు మాత్రమే పీఎల్‌ఐ పథకం వర్తిస్తుంది. ఈవీ రంగానికి వచ్చే సరికి.. చాలా వరకు కొత్త కంపెనీలు, ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న సంస్థలు ఉన్నాయి. మరోవైపు ఈ రంగంలో ఉన్న చాలా కంపెనీలు చిన్న, మధ్య తరహా పరిశ్రమల కిందకు వస్తాయి. అయితే, పీఎల్‌ఐ స్కీంను ఈ రంగాలకు కూడా వర్తింపజేయాలని హెచ్‌ఓపీ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సీఈఓ, వ్యవస్థాపకులు కేతన్‌ మెహతా అన్నారు. అందుకనుగుణంగా పీఎల్‌ఐ నిబంధనల్లో మార్పులు చేయాలని కోరారు.

పరిశోధనలతోనే ప్రగతి...

ఈవీ రంగంలో ఇంకా భారీ ఎత్తున పరిశోధనలు జరగాల్సి ఉంది. ముఖ్యంగా బ్యాటరీల పరిమాణం, విభిన్న మూలకాలతో తయారు చేయగలిగే బ్యాటరీలు, బ్యాటరీ స్వాపింగ్‌ సాంకేతికతను మరింత సులభతరం చేయడం వంటి విషయాల్లో ఇంకా ఎంతో పురోగతి సాధించాల్సి ఉంది. అలాగే మరింత చౌకగా ఈ సాంకేతికతలను ఎలా అందుబాటులోకి తీసుకురావాలో కూడా శోధించాల్సి ఉంది. ఉదాహరణకు లిథియం-ఐయాన్‌ బ్యాటరీలో వాడే మూలకాలు కేవలం కొన్ని దేశాల్లో, పరిమిత స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా సోడియం ఐయాన్‌ బ్యాటరీలను అభివృద్ధి చేశారు. లిథియంతో పోలిస్తే.. సోడియం విస్తృతంగా లభించే మూలకం. ఇలా ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. అందుకోసం పరిశోధనలపై భారీ ఎత్తున ఖర్చు చేయాలి. ఆ దిశగా కృషి చేస్తున్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో ఈవీ పరిశోధనలను ప్రోత్సహించే దిశగా విధానపరమైన నిర్ణయాలతో పాటు కేటాయింపులు కూడా ఉండాలని ఆశిస్తున్నారు.

స్టార్టప్‌లకు ప్రోత్సాహం...

ఈవీ రంగంలో అనేక అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయి. వినూత్న పరిష్కార మార్గాలకు బాటలు వేస్తున్నాయి. పైగా కొత్త కొత్త ఆవిష్కరణలకు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ స్టార్టప్‌లకు ప్రభుత్వం రాయితీలు, అనుమతులు, రుణాల విషయంలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రంగంలోని స్టార్టప్‌లకు పీఎల్‌ఐ పథకాన్ని విస్తరిస్తే ఇంకా మేలు. ముఖ్యంగా బ్యాటరీ, సెల్‌ తయారీలో స్టార్టప్‌లు చాలా చురుగ్గా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

దేశీయ తయారీ...

ఈవీ తయారీకి బ్యాటరీలు ఎంత ముఖ్యమో.. సెమీకండక్టర్లు కూడా అంతే అవసరం. విద్యుత్తు వాహన తయారీకి అయ్యే ఖర్చులో వీటిదే 40 శాతం వాటా. కాబట్టి ఈ రెండింటి తయారీని దేశీయంగా చేపట్టేలా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించాలి. దీన్ని దశలవారీగా చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. తొలుత అసెంబ్లింగ్‌లో ముందడుగు వేసిన తర్వాత పూర్తిగా ఇక్కడే తయారు చేసేలా నిర్ణయాలు ఉండాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.

పన్నులనూ సవరించాలి...

ఈవీ విక్రయాలను ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకురావడం పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. అదే బాటలో ఈవీ రెంటల్స్‌, ఛార్జింగ్‌ మౌలిక వసతులు, బ్యాటరీలు, మరమ్మతులు సహా ఇతర సేవలనూ 5 శాతం పన్ను శ్లాబులోకి తీసుకురావాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఇది పూర్తిగా జీఎస్టీ మండలి పరిధిలోని అంశమైనప్పటికీ.. బడ్జెట్‌లో ఆ దిశగా కేంద్రం తన ఉద్దేశాన్ని ప్రకటించగలిగితే భవిష్యత్తులో సానుకూల నిర్ణయం ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వినియోగదారులకిచ్చే రుణాలపైనా వడ్డీ రేట్లను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఈవీల కొనుగోలుపై చేసే ఖర్చును కొంతకాలం పాటు పన్ను మినహాయింపు పరిధిలోకి తీసుకొస్తే మరింత త్వరగా కాలుష్య రహిత వాహనాలు భారత రోడ్లపై పరుగులు పెట్టే అవకాశం ఉంది.

యావత్తు ప్రపంచం ఈవీ దిశగా మారుతున్న ఈ తరుణంలో భవిష్యత్తులో ఈవీల తయారీకి భారత్‌ను కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఈ మార్కెట్‌లో ఆధిపత్యం సాధిస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థకు అది అండగా నిలుస్తుంది. ఈ క్రమంలో భారీ ఎత్తున ఉద్యోగ కల్పనా జరుగుతుంది. మరి ఈ విషయంలో కేంద్ర వ్యూహాలేంటో బడ్జెట్‌ కేటాయింపుల్లో చూడాల్సి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ చూడండి :క్యూ3లో డాక్టర్ రెడ్డీస్​ లాభం రూ.707 కోట్లు

Last Updated : Jan 28, 2022, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details