తెలంగాణ

telangana

ETV Bharat / business

'కొత్త ఐటీ రూల్స్​ పాటిస్తున్న ట్విట్టర్'

ట్విట్టర్​..​ కొత్త ఐటీ నిబంధనలను పాటిస్తోందని దిల్లీ హైకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. సీసీఓ, ఆర్​జీఓ, నోడల్​ కాంటాక్ట్​ అధికారులుగా శాశ్వత ఉద్యోగులను నియమించినట్లు పేర్కొంది. మరోవైపు.. ఐటీ రూల్స్​-2021 అమలుపై తాత్కాలిక స్టే ఎందుకు విధించకూడదో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది బాంబే హైకోర్టు.

twitter it rules delhi high court
'ట్విట్టర్ కొత్త ఐటీ రూల్స్​ పాటిస్తోంది'

By

Published : Aug 10, 2021, 2:56 PM IST

Updated : Aug 10, 2021, 5:28 PM IST

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనలను సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌ 'ప్రాథమికంగా' పాటించిందని కేంద్రం మంగళవారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. చీఫ్‌ కాంప్లయెన్స్‌ ఆఫీసర్‌, రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌, నోడల్‌ కాంటాక్ట్‌ పర్సన్‌ను శాశ్వత ప్రాతిపదికన నియమించిందని పేర్కొంది.

నూతన ఐటీ నిబంధనలను ట్విట్టర్‌ పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మ వాదనలు వినిపిస్తూ.. "నూతన చట్టాలకు అనుగుణంగా ట్విట్టర్‌ అధికారులను నియమించింది. అందుకు సంబంధించిన వివరాలను సంబంధిత సంస్థ ప్రతినిధులు నాకు మెయిల్‌ ద్వారా వెల్లడించారు" అని తెలిపారు. ఇందుకు జస్టిస్‌ రేఖా పల్లి స్పందిస్తూ.. దీనిపై రెండు వారాల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. ఆ అఫిడవిట్‌ను రికార్డ్‌ చేస్తామని తెలిపారు.

మరోవైపు ఈ విషయంపై ట్విట్టర్‌ కూడా వివరణ ఇచ్చింది. కోర్టు గడువు కల్పించడంతో సమస్యను పరిష్కరించుకున్నామని, శాశ్వత ప్రాతిపదికన అధికారులను నియమించామని వెల్లడించింది. ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌ను రికార్డు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. దీనిపై తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది.

నూతన ఐటీ నిబంధనల అమలు విషయంలో ట్విట్టర్‌, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఐటీ చట్టాలను పాటించనందుకు గానూ ట్విట్టర్‌ మధ్యవర్తి రక్షణ హోదా కూడా కోల్పోయింది. దీంతో పలు రాష్ట్రాల్లో సంస్థ ప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి.

కొత్త ఐటీ రూల్స్​పై స్టే ఎందుకు విధించకూడదు?

ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ(ఐటీ) నిబంధనలు-2021 అమలు చేయకుండా తాత్కాలిక స్టే ఎందుకు విధించకూడదో సమాధానం తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది బాంబే హైకోర్టు. నూతన ఐటీ నిబంధనల అమలుపై స్టే విధించాలని కోరూతూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారణలో భాగంగా ఈ ఆదేశాలిచ్చింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ దీపాంకర్​ దత్త, జస్టిస్​ జీఎస్​ కులకర్ణితో కూడిన ధర్మాసనం. ఆగస్టు 12లోపు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.

కొత్త నిబంధనలు అస్పష్టంగా, కఠినమైనవిగా ఉన్నాయని, రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంటూ.. డిజిటల్​ న్యూస్​ పోర్టల్​ ద లీఫ్​లెట్​, జర్నలిస్ట్​ నిఖిల్​ వాగ్లే ఈ పిటిషన్​ దాఖలు చేశారు.

అయితే.. తుది విచారణ పూర్తి కాకుండా స్టే విధించొద్దని కోర్టును కోరారు ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్​ జనరల్​ అనీల్​ సింగ్​.

ఇదీ చదవండి:' కొత్త నిబంధనల మేరకు ఆ పదవులకు శాశ్వత అధికారులు'

Last Updated : Aug 10, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details