తెలంగాణ

telangana

ETV Bharat / business

మొబైల్‌ బ్యాంకింగ్‌ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

నగదుకు ప్రత్యామ్నాయంగా డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరిగాయి. బ్యాంకులు ఎంతగా అప్రమత్తం చేస్తున్నా.. ఏదో ఒక రకంగా వినియోగదారులు సైబర్​ నేరాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ బ్యాంకింగ్ చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి..

mobile banking
మొబైల్‌ బ్యాంకింగ్‌

By

Published : Jul 23, 2021, 10:15 AM IST

ఒకప్పుడు నగదు లావాదేవీలు జరపాలంటే బ్యాంక్‌కు వెళ్లి.. రశీదు నింపి.. క్యూలో నిలబడి.. అబ్బో.. చాలా శ్రమపడాల్సి వచ్చేది. కానీ సాంకేతికత పెరిగి.. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక బ్యాంకింగ్‌ సేవలన్నీ అరచేతిలోకి వచ్చేశాయి. బ్యాంకులకు చెందిన యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని నగదు బదిలీ నుంచి.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వరకు అన్నీ అందులోనే చేయొచ్చు. అదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు.. మన డబ్బు దోచుకోవడానికి కాచుకొని ఉంటారన్న విషయం గుర్తుంచుకోవాలి. మొబైల్‌ బ్యాంకింగ్‌ చేసేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన అకౌంట్‌లో ఉండే డబ్బును స్వాహా చేసేస్తారు. అందుకే, మొబైల్‌ యాప్‌ ద్వారా లావాదేవీలు జరిపేటప్పుడు ఈ చిట్కాలు పాటించి.. మీ నగదును కాపాడుకోండి.

అధికారిక యాప్‌ అవునో.. కాదో!?

మొబైల్‌ బ్యాంకింగ్‌ చేయాలంటే ఫోన్‌లో బ్యాంక్‌కు సంబంధించిన యాప్‌ తప్పనిసరిగా ఉండాలి. వీటిని ప్లేస్టోర్‌/యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, వాటిలో బ్యాంక్‌ అధికారిక యాప్‌తోపాటు నకిలీ యాప్‌లు కూడా కనిపిస్తాయి. పొరపాటునైనా నకిలీ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోకండి. ఒకటికి రెండుసార్లు పరిశీలించి.. బ్యాంక్‌ అధికారిక యాప్‌ను మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోండి. అంతేకాదు, యాప్‌ను ఎవరూ సులువుగా ఓపెన్‌ చేయకుండా కఠినమైన పాస్‌వర్డ్‌ పెట్టుకోండి.

పెద్ద మొత్తంలో నగదు బదిలీలో జాగ్రత్త

ప్రస్తుతం అన్ని మొబైల్‌ యాప్స్‌లో నగదు బదిలీ చేయాల్సిన లబ్ధిదారుడి (బెనిఫిషియరీ) బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను ముందుగానే నిక్షిప్తం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే, మొబైల్‌లో అకౌంట్‌ వివరాలు నమోదు చేసే సమయంలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. వివరాలు తప్పుగా నమోదు చేసినట్లయితే పంపే డబ్బు వేరొకరి అకౌంట్లో పడటమో.. లావాదేవీ మధ్యలో నిలిచిపోవడమో జరిగి ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే, పెద్ద మొత్తంలో డబ్బు పంపేందుకు ముందు రూ. 1 పంపించి చూడండి. మీరు పంపాలనుకున్న వ్యక్తి అకౌంట్‌లోనే ఆ డబ్బు జమయిందో లేదో నిర్ధారించుకొని మిగతా డబ్బును పంపించండి.

పబ్లిక్‌ వైఫై వాడుతున్నారా?

ఇంటర్నెట్‌ లేకపోతే ఏ పనీ జరగని పరిస్థితి. అందుకే ప్రభుత్వాలు.. ప్రైవేటు సంస్థలు పలు ప్రాంతాల్లో ఉచితంగా పబ్లిక్‌ వైఫైను అందిస్తున్నాయి. సాధారణ విషయాలకు ఈ వైఫై వాడుకోవడంలో పెద్దగా ప్రమాదం లేకపోవచ్చు. కానీ, మొబైల్‌ బ్యాంకింగ్‌ చేయడం మాత్రం చాలా ప్రమాదం. పబ్లిక్‌ వైఫై ఉపయోగిస్తున్నప్పుడు మీ మొబైల్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసే అవకాశాలు చాలా ఎక్కువ. అలా హ్యాక్‌ చేశారంటే మీకు తెలియకుండా మీ మొబైల్‌ బ్యాంకింగ్‌ వివరాలు తస్కరించి డబ్బులు దోచుకుంటారు. కాబట్టి.. వీలైనంత వరకు బ్యాంకింగ్‌కు పబ్లిక్‌ వైఫై వినియోగించకండి. మీ మొబైల్‌ ఇంటర్నెట్‌ వాడండి. లేదా మీకు సురక్షితం అనిపించే వైఫై కనెక్షన్‌ను వాడండి.

వన్‌ టైం పాస్‌వర్డ్‌ ఎవరికీ చెప్పొద్దు

మొబైల్‌ బ్యాంకింగ్‌ సమయంలో కొన్ని బ్యాంక్‌ యాప్‌లు వన్‌ టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ)ని అడుగుతుంటాయి. అయితే, అదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు బ్యాంక్‌ అధికారుల్లా ఫోన్‌, ఎస్‌ఎంస్‌ఎస్‌ లేదా మెయిల్‌ చేసి మీకు వచ్చే ఓటీపీని అడగొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎవరితోనూ పంచుకోకండి. ఒక్కసారి ఓటీపీ సైబర్‌ నేరగాళ్లకు చేరిందంటే ఆ క్షణంలోనే మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ అవుతుంది. ఇలాంటి ప్రమాదం ఉంటుందనే ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పొద్దంటూ బ్యాంకులే స్వయంగా ఖాతాదారులను హెచ్చరిస్తుంటాయి.

యాప్‌ అప్‌డేట్‌

సైబర్‌ కేటుగాళ్లు మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లపై నిత్యం దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకోసం అనేక పద్ధతులు ఉపయోగిస్తుంటారు. అందుకే, వీరి బారి నుంచి ఖాతాదారుల్ని రక్షించడానికి బ్యాంకులు ఎప్పటికప్పుడు యాప్‌లోని భద్రతాలోపాలను సవరిస్తూ అప్‌డేట్‌ వర్షన్లను తీసుకొస్తుంటాయి. వాటిని గమనించి యాప్‌ను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలి. లేదంటే హ్యాకర్లకు చిక్కే ప్రమాదముంది.

అపరిచితులకు మొబైల్‌ ఇస్తే..

బ్యాంకింగ్‌ యాప్‌లనే కాదు.. మీ మొబైల్‌నూ భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఫోన్‌ను ఎవరైనా తీసుకొని బ్యాంకింగ్‌ యాప్‌లను యాక్సెస్‌ చేసే అవకాశం ఇవ్వకండి. ఫోన్‌ను మీరు మాత్రమే ఉపయోగించుకునేలా పాస్‌వర్డ్‌, ఫింగర్‌ప్రింట్‌ అన్‌లాక్‌ వంటివి ఉపయోగించండి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details