నమోదిత కంపెనీల్లో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) పదవులను విడదీయాలన్న నిబంధనల అమలును సెబీ రెండేళ్ల పాటు వాయిదా వేసింది. కార్పొరేట్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో పాటు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం.. అగ్రగామి 500 నమోదిత కంపెనీలు 2020 ఏప్రిల్ 1 నుంచి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) పదవులను విడదీయాలి. సీఎండీ పేరిట ఒకరే నిర్వహించరాదు. ఇలా ఆ పదవులను విడదీయడం ద్వారా కార్పొరేట్ పాలనా ప్రమాణాలు మెరుగుపరచాలన్నది సెబీ ఉద్దేశం. ఈ నిబంధన అమలు తేదీని 2022 ఏప్రిల్ 1కి వాయిదా వేస్తున్నట్లు జనవరి 10న విడుదలైన ఒక నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ వాయిదాకు సెబీ ఎటువంటి కారణం తెలుపలేదు.
వినతుల నేపథ్యంలో..
నమోదిత కంపెనీలు ఈ నిబంధనలను పాటించడానికి ఇంకాస్త సమయం కావాలని ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ సంఘాల నుంచి సెబీకి వినతులు వెల్లినట్లు తెలుస్తోంది. స్టాక్ ఎక్స్ఛేంజీల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అగ్రగామి 500 నమోదిత కంపెనీల్లో 50 శాతం మాత్రమే ఈ నిబంధన పాటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు రెండు పదవులను సీఎండీగా విలీనం చేయడంతో బోర్డు, మేనేజ్‌మెంట్‌లో ఒకే వ్యక్తి రెండు విధాలా వ్యవహరించాల్సి వస్తోంది. ఇది వాటాదార్ల ప్రయోజనాలకు ఇబ్బందని భావించిన సెబీ ఆ పదవిని విభజించనున్నట్లు మే 2018న ప్రకటించింది. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, విప్రో, హీరో మోటోకార్ప్ వంటి దిగ్గజ కంపెనీల్లో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవులను ఒకే వ్యక్తి నిర్వహిస్తున్నారు.