నమో 2.0 ప్రభుత్వం కొలువుదీరాక.. సరికొత్త ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వంలో నోట్లరద్దుతో ప్రజలకు షాక్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ... ఈసారి మరో సంస్కరణకు సిద్ధమవుతున్నారు. అధిక విలువుండే నగదు లావాదేవీలను నియంత్రించడం, డిజిటల్ చెల్లింపులను తప్పనిసరి చేయడం వంటి చర్యల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది ప్రభుత్వం.
ఈ ప్రక్రియ ద్వారా నగదు వినియోగాన్ని తగ్గించి.. నల్లధనాన్ని అరికట్టవచ్చని భావిస్తున్నారు. ఏడాదికి రూ.10 లక్షలకుపైగా ఉపసంహరించడం వల్ల రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లించాల్సి రావడం నష్టమేనని, దీనివల్ల భారీస్థాయి నగదు లావాదేవీలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రూ.10 లక్షలకుపైగా నగదు ఉపసంహరణ చాలా మంది వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు అవసరం ఉండదని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పేద, మధ్య తరగతి ప్రజలపై భారం వేయకూడదనేది ప్రభుత్వం ఉద్దేశంగా ఉన్నట్లు సమాచారం.
ఈ తరహా నిర్ణయంపై అంతర్గతంగా చర్చ జరుగుతోందని, పన్ను 3 నుంచి 5 శాతం మధ్య ఉండొచ్చని అధికార వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే ప్రస్తుతం బ్యాంకులు ఆన్‌లైన్ నగదు బదిలీలపై విధించే ఎన్‌ఈఎఫ్‌టీ/ఆర్‌టీజీఎస్ చెల్లింపు సేవలపై రుసుముల్ని రిజర్వు బ్యాంకు ఎత్తివేసిందని చెబుతున్నారు.
ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణపై బ్యాంకులు విధిస్తోన్న రుసుములపై సమీక్ష నిర్వహించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చల స్థాయిలోనే ఉందని, దీనికి సానుకూలత వ్యక్తమవుతున్నట్లు అధికార వర్గాల సమాచారం. బడ్జెట్ నాటికి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదనతోపాటు అధిక విలువైన నగదు ఉపసంహరణలు అన్నింటికీ ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయాలనే ప్రతిపాదననూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల వ్యక్తిగత స్థాయిలో పరిశీలన ఉండటమే కాక, పన్ను చెల్లింపులపైనా నిఘా ఉంటుందని భావిస్తున్నారు. పెట్టుబడి తదితర వ్యయాలపైనా పరిమితులు విధించే దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.