Tata Motors News: గ్రామీణ ప్రాంతాల్లో కార్ల విక్రయాలు పెంచుకోవడానికి టాటా మోటార్స్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మొబైల్ షోరూమ్‌లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా 100కు పైగా మొబైల్ షోరూమ్‌లను ప్రారంభిస్తున్నట్లు టాటా మోటార్స్ గురువారం తెలిపింది. షోరూమ్ ఆన్ వీల్స్ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమానికి అనుభవ్ అని నామకరణం చేసింది.
దేశవ్యాప్తంగా 103 మొబైల్ షోరూమ్‌లను ప్రారంభిస్తున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. వీటి ద్వారా కంపెనీ డీలర్లు తమ మార్కెట్‌ను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే వీలుంటుందని తెలిపింది. మొబైల్ షోరూమ్‌ల వద్ద కొత్త కారు మోడళ్ల వివరాలతో పాటు, అందుబాటులో ఉన్న ఫైనాన్స్ సదుపాయాలు, టెస్ట్ డ్రైవ్ బుకింగ్, ఎక్స్ష్చేంజీపై వచ్చే మొత్తం వంటి వివరాలు ఈ షోరూమ్‌ల వద్ద లభిస్తాయని టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్ కస్టమర్ కేర్) రాజన్ అంబా తెలిపారు.