రైల్వే శాఖ దేశంలోని 100 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడిపేందుకు చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరిన్ని తేజస్ రైళ్లను పర్యాటక ప్రాంతాలకు అనుసంధానిస్తామని వెల్లడించారు. మరోవైపు భారత రైల్వే శాఖ ప్రైవేటు కంపెనీలకు అందించిన ఆహ్వానానికి విశేష స్పందన లభించింది. దాదాపు 24కుపైగా ప్రపంచ స్థాయి సంస్థలు ఆసక్తి చూపాయి.
వీటిలో ఆల్సోటామ్ ట్రాన్స్‌పోర్టు, బంబార్డియర్, సీమన్స్ ఏజీ, హ్యూందాయ్ రోటెమ్ వంటి సంస్థలు ఆసక్తి చూపాయి. ఇక దేశీయ కంపెనీల్లో టాటా రియాల్టీ, హిటాచీ ఇండియా, ఎస్సెల్ గ్రూప్, అదానీ పోర్ట్స్, ఐఆర్‌సీటీసీ వంటి సంస్థలు ఉన్నాయి.
ఈ మార్గాల్లో..
భారత రైల్వేశాఖ ఇప్పటికే 100 మార్గాలను గుర్తించి 150 రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ 100 మార్గాలను 10-12 క్లస్టర్లుగా మార్చారు. ముంబయి-న్యూదిల్లీ, చెన్నై-న్యూదిల్లీ, న్యూదిల్లీ - హౌరా, షాలిమార్-పుణె, న్యూదిల్లీ-పట్నా వంటి మార్గాలు వీటిల్లో ఉన్నాయి. ప్రతి రైలులో కనీసం 16 కోచ్‌లు ఉంటాయి. ఇక ఆ మార్గంలో ప్రయాణించే అతిపెద్ద రైలు కంటే ఎక్కువ కోచ్‌లు మాత్రం అమర్చకూడదు. ఈ ప్యాసింజర్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అనుమతులు ఉన్నాయి. ఈ మర్గంలో ధరలను ఆయ సంస్థలు నిర్ణయించుకోవచ్చు. రైళ్ల నిర్వహణ, కొనుగోలుకు సంబంధించిన నిధులను ఆయా సంస్థలే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: త్వరలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారంగా రూ.35,000 కోట్లు!