దేశీయంగా మార్కెట్‌ను(Stock markets) ప్రభావితం చేసే అంశాలేవి లేని నేపథ్యంలో.. ఈ వారం సూచీలను అంతర్జాతీయ పరిణామాలే ముందుకు నడిపించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వారంలోనే ముగియనున్న నవంబరు డెరివేటివ్ కాంట్రాక్ట్‌లతో మార్కెట్(Market Outlook) కొంతమేర ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు.
"నవంబరు 25తో డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ముగియనుండటం వల్ల మార్కెట్ హెచ్చుతగ్గులు ఎదుర్కొవచ్చు. అదే సమయంలో అంతర్జాతీయ పరిణామాలపై మదుపరులు దృష్టిసారించే అవకాశం ఉంది."
- అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్
''ఫలితాల సీజన్ ముగియడం వల్ల సూచీల కదలికలను అంతర్జాతీయ సంకేతాలు నిర్దేశిస్తాయి. దేశీయంగా ఎలాంటి సానుకూల అంశాలు లేని సమయంలో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటాయి.''
- యేషా షా, సామ్కో సెక్యూరిటీస్
ద్రవ్యోల్బణ ఒత్తిడి ప్రపంచ మార్కెట్లను వెంటాడుతూనే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. వీటితోపాటు రూపాయి కదలికలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పెట్టుబడి ధోరణి మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశముంది.
60 వేల దిగువన సెన్సెక్స్
ఇటీవల జీవితకాల గరిష్ఠాలను తాకిన దేశీయ స్టాక్ మార్కెట్(stock market news) సూచీలు.. గచిడిన రెండు మూడు వారాలుగా భారీగా పతనమవుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్(bse sensex) 30 సూచీ గతవారం 1050.68 పాయింట్లు దిగజారింది. 60 వేల దిగువకు చేరింది. మరో సూచీ ఎన్ఎస్ఈ-నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే పయనిస్తుంది. అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, దేశీయంగా సానుకూల అంశాలు లేకపోవడం, ఇటీవల ప్రకటించిన సంస్థల క్యూ2 ఫలితాలు అంతగా ఆకట్టుకోకపోవడం, ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ కేసుల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిడి, మదుపర్ల లాభాల స్వీకరణ, విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడి ధోరణి సహా పలు కారణాలు వల్ల సూచీలు డీలా పడినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:రిలయన్స్- ఆరాంకో డీల్‌కు బ్రేక్.. కారణం అదే!