తెలంగాణ

telangana

ETV Bharat / business

'దేశీయ మార్కెట్ల పతనంతో మంచి అవకాశం' - మదుపరులు

కరోనా ప్రభావంతో దేశీయ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురవుతున్నాయి. అయితే ఈ పతనాన్ని చిన్న మదుపరులు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఒక అవకాశంగా చూడవచ్చు. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఒకటి ఉందని బజాజ్​ అలయంజ్​ లైఫ్ ఇన్సూరెన్స్ సీఐఓ సంపత్​ రెడ్డి అంటున్నారు. ప్రస్తుత దిద్దుబాటు ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు.

share market
మార్కెట్‌ పతనం ... ఇచ్చిందో అవకాశం

By

Published : Mar 17, 2020, 7:58 AM IST

మార్కెట్‌లో స్వల్పకాలంలో కనిపిస్తున్న ఆటుపోట్లకు కరోనా వైరస్‌తోపాటు.. కార్పొరేట్‌ ఆదాయాలు తగ్గుతాయనే ఆందోళనా కారణం అవుతోంది. ప్రస్తుత దిద్దుబాటు ముగిసిందని చెప్పలేం. ఈ పతనాన్ని చిన్న మదుపరులు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఒక అవకాశంగా చూడొచ్చు’ అని అంటున్నారు బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సంపత్‌ రెడ్డి. ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఇంకా ఏమంటున్నారంటే...

  • మార్కెట్‌ పతనం అవుతుండటంతో చాలామంది స్థిరాదాయ పథకాలవైపు మొగ్గు చూపిస్తున్నారు? 2020లో మార్కెట్‌ కన్నా.. వీటికి ఆదరణ ఉంటుందా? మదుపరుల వ్యూహం ఎలా ఉండాలి?

మార్కెట్‌లో హెచ్చుతగ్గులు నమోదైనప్పుడు సహజంగానే బంగారం, స్థిరాదాయ పథకాలు కొద్దిగా ఆసక్తిగా మారుతుంటాయి. ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది. రానున్న రోజుల్లోనూ స్టాక్‌ మార్కెట్‌ అనిశ్చితి ఇలాగే కొనసాగితే.. వీటికి స్వల్పకాలంలో మరింత గిరాకీ పెరుగుతుంది. అయితే, చరిత్రను పరిశీలిస్తే.. దీర్ఘకాలంలో స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత పెట్టుబడులు ఇతర పథకాలకన్నా (స్వల్పకాలంలో ఆటుపోట్లు, దిద్దుబాట్లు ఉన్నా) మంచి రాబడులే అందించాయని చెప్పొచ్చు. ఓపికతో ఎదురుచూసిన వారికి షేర్‌ మార్కెట్‌ ఎప్పుడూ మంచి లాభాలనే పంచింది. మార్కెట్‌ పతనం చిన్న మదుపరులకు మరో అవకాశాన్ని తెచ్చిందనే చెప్పాలి. ఈ సమయంలో క్రమానుగత పెట్టుబడి (సిప్‌) విధానంలో మదుపును కొనసాగించడం మేలు. పెట్టుబడుల కోసం లార్జ్‌ క్యాప్‌ ఫండ్లు, షేర్లను పరిశీలించాలి. కొన్ని మిడ్‌ క్యాప్‌ షేర్లు పూర్తిగా కిందకు వచ్చాయి. విలువ ఆధారంగా వీటిపైనా దృష్టి సారించవచ్చు.

  • ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏయే రంగాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి?

గత 1-2 ఏళ్ల మార్కెట్‌ పరిస్థితిని గమనిస్తే.. వృద్ధి పథంలో కొనసాగుతూ వచ్చింది. దాదాపు అన్ని షేర్లకూ ‘ప్రీమియం’ చెల్లించడానికీ సిద్ధం అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు కుదటపడ్డాక మళ్లీ ఇలాంటి పరిస్థితి కనిపించే అవకాశం లేకపోలేదు. అందుకే, వృద్ధి ఆధారిత రంగాలపై దృష్టి సారించాలి. ఇప్పటికీ ఫైనాన్షియల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు ఆసక్తిగానే కనిపిస్తున్నాయి. దీంతోపాటు విలువ ఆధారిత పెట్టుబడులను పరిశీలించేవారికి ఫార్మా, టెక్నాలజీ రంగాలూ ఒక అవకాశంగానే కనిపిస్తున్నాయి.

  • ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ కరోనా ప్రభావానికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్‌ పరిస్థితి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది?
  • రోజురోజుకూ కరోనా (కోవిడ్‌-19) కేసులు పెరుగుతుండటం కాస్త ఆందోళన కలిగించే విషయమే. అయితే, గతంలో వచ్చిన అంటువ్యాధులతో పోలిస్తే కరోనా మరణాలు చాలా తక్కువ. ఇది కొంత సానుకూలత. ఇక చైనా ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ జీడీపీలో 16 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 12-13 శాతం వాటా ఉంది. కాబట్టి, కరోనా వైరస్‌ ప్రభావం ప్రôపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చైనా నుంచి ఎగుమతులూ ఎక్కువే. కనుక వైరస్‌ తీవ్రత మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే.. ప్రపంచ వ్యాప్తంగా సరఫరాకు అడ్డంకులు ఏర్పడవచ్చు. ఇది మరింత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటికే మన దేశంతో సహా, పలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్ర దిద్దుబాటుకు గురయ్యాయి. భవిష్యత్తు ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయడమూ కష్టమే. మార్కెట్‌ను నిరంతరం గమనిస్తూ.. అవకాశం కోసం ఎదురుచూడటమే ఇప్పుడు మనం చేయాల్సిన పని.
  • విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ)లు ఇన్నాళ్లూ మన మార్కెట్‌పై నమ్మకం ఉంచారు కదా! ఇప్పుడు ఒక్కసారిగా విక్రయాలు చేపట్టడానికి కారణం ఏమిటి?

ప్రôపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ నేపథ్యంలో గందరగోళం ఏర్పడటంతో భారత్‌తో సహా, పలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల నుంచి ఎఫ్‌ఐఐలు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం వల్ల కార్పొరేట్‌ ఆదాయాలు తగ్గే అవకాశం ఉంది. భారత మార్కెట్లో దిద్దుబాటు రావడానికి ఇదీ ఒక కారణం. కరోనా వైరస్‌ విజృంభిస్తే.. స్వల్పకాలంలో మరింత ఆటుపోట్లు కనిపించే అవకాశం ఉంది. అయితే, ఏదో ఒక చోట మార్కెట్లకు పట్టు దొరుకుతుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి, కార్పొరేట్‌ ఆదాయాలు మెరుగైనప్పుడు మళ్లీ.. మార్కెట్‌ జోరు కొనసాగుతుందని చెప్పొచ్చు.

ఇదీ చూడండి:మీ డిపాజిట్లు వెనక్కి తీసుకోవచ్చు

ABOUT THE AUTHOR

...view details