వ్యక్తిగత రుణం అంటే.. ఎలాంటి తనఖాలు, హామీలు లేకుండానే లభిస్తుంది. కాబట్టి, రుణ సంస్థ మీ గత రుణాలకు సంబంధించిన చెల్లింపులను పట్టిపట్టి చూస్తుంది. దీనికోసం చూసేది క్రెడిట్ స్కోరు, రుణ చరిత్ర నివేదిక. అందుకే, వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేసుకునేప్పుడే.. ముందుగా మీ క్రెడిట్ స్కోరు ఎంతుందన్న సంగతిని తెలుసుకోండి. ఈ స్కోరు 750కి మించి ఉంటే.. ఈరుణంలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలూ అందే అవకాశం ఉంటుంది. అధిక మొత్తంలో రుణం రావడంతోపాటు, వడ్డీ కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. కొన్ని బ్యాంకులు/రుణ సంస్థలు క్రెడిట్ స్కోరు అనుకున్నంత లేనివారికీ అప్పులు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అయితే, రుణం చాలా తక్కువ మొత్తంలో రావడంతోపాటు, అధిక వడ్డీ కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు.. అధిక ఆదాయం ఉండటమే మార్గం. మంచి క్రెడిట్ స్కోరు ఉండి, మీతోపాటు సహదరఖాస్తుదారుడిగా ఉండేందుకు అర్హత ఉన్న వ్యక్తితో కలిసి దరఖాస్తు చేయొచ్చు.
ముందే మంజూరు చేస్తే..
కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల అర్హతలను బట్టి, వ్యక్తిగత, వాహన, గృహ రుణం ఇస్తామంటూ హామీ ఇస్తుంటాయి. ఎంత మొత్తం ఇచ్చేదీ చెబుతాయి. ఇలాంటి ఆఫర్లు ఎంతో శ్రమను తప్పిస్తాయి. అనేకానేక పత్రాలను సమర్పించాల్సిన అవసరమూ ఉండదు. సాధారణ రుణ దరఖాస్తులతో పోలిస్తే, ఇవి వేగంగా పరిష్కారం అవుతాయి. తొందరగా అప్పు చేతికి అందుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. రుణం వచ్చేదీ లేనిదీ అంతిమంగా నిర్ణయించేది బ్యాంకు నియమనిబంధనలే. ముందస్తుగా అనుమతించే రుణ మొత్తం కేవలం మీ క్రెడిట్ స్కోరు ఆధారంగా పేర్కొంటారు. కొన్నిసార్లు క్రెడిట్ స్కోరులాంటివేమీ లేకున్నా ఈ ముందస్తు అనుమతి లభిస్తుంది. ఒకసారి రుణానికి దరఖాస్తు చేసుకున్నాకే అసలు విషయం తెలుస్తుంది.
వడ్డీ రేట్లు.. ఎక్కడ తక్కువ
హామీ ఉండే రుణాలతో పోల్చినప్పుడు.. ఎలాంటి హామీ లేని వ్యక్తిగత రుణాలకు వడ్డీ కాస్త అధికంగానే ఉంటుంది. కానీ, వీటి మంజూరులో బ్యాంకులు/రుణ సంస్థల మధ్య పోటీ అధికంగానే ఉంటుంది. అందుకే, ఈ రుణాలపై ఉన్న ఆఫర్లను మనం వదులుకోకూడదు. ఏ బ్యాంకు/రుణ సంస్థ ఎలాంటి ఆఫర్లను ప్రకటిస్తోంది వెతికి చూడాలి. కొన్ని సంస్థలు వడ్డీ రేటులో రాయితీ ఇస్తుంటాయి. మరికొన్ని ప్రాసెసింగ్ ఫీజుల్లాంటివి రద్దు అంటుంది.. వడ్డీ రేటు అరశాతం తగ్గినా కొంత ఊరటే కదా.. అప్పు అవసరం అయ్యిందని తొందర పడొద్దు.. కాస్త ఓపిక చేసుకొని, అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ విశ్లేషించుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. వడ్డీ రేటు, వ్యవధి ఆధారంగా ఈఎంఐ ఎంత ఉంటుందిలాంటి వాటిని తెలుసుకోవాలి. మీకు ఆర్థికంగా ఇబ్బంది కలగని మేరకు ఈఎంఐని నిర్ణయించుకొని, దానికి తగ్గట్టు వ్యవధిని ఎంచుకోవాలి.