21వ శతాబ్దం.. 21వ సంవత్సరం.. 21వ తేదీ.. (2021 జనవరి 21). స్టాక్‌మార్కెట్‌లో ఇది మరిచిపోలేని రోజు. ఎందుకంటే చరిత్రలో తొలిసారిగా బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీ 50000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. ఈ స్థాయి ఎగువనే ముగిస్తే.. మదుపరి సంతోషం వేరే స్థాయిలో ఉండేది. కానీ లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చేసి కాస్త నిరాశపరిచింది.
ఓపెనింగ్ అదిరింది..
సానుకూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు బలపడి 5 నెలల గరిష్ఠస్థాయి అయిన 72.99కి చేరడంతో గురువారం ఉదయం సెన్సెక్స్ 50,000 పాయింట్ల ఎగువన ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ.. ఇంట్రాడేలో 50,148.01 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది. ఒకానొకదశలో 49,398.86 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయిన సూచీ.. చివరకు 167.36 పాయింట్ల నష్టంతో 49,624.76 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 14,753.55 పాయింట్ల వద్ద కొత్త రికార్డు గరిష్ఠ స్థాయిని చేరింది. ఆఖరుకు 54.35 పాయింట్లు కోల్పోయి 14,590.35 దగ్గర స్థిరపడింది.
ఈ షేర్లు మెరిశాయ్..
సెన్సెక్స్ 30 షేర్లలో 9 మాత్రమే లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 2.72 శాతం వరకు పెరిగాయి. ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం, సన్‌ఫార్మా, ఐటీసీ, టెక్ మహీంద్రా 4 శాతం వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో టెలికాం, స్థిరాస్తి, లోహ, ఆరోగ్య సంరక్షణ 2.64 శాతం వరకు కోల్పోయాయి. మన్నికైన వినిమయ వస్తువులు, ఇంధన, యంత్ర పరికరాలు పడ్డాయి. బీఎస్‌ఈలో 1036 షేర్లు లాభపడగా, 1983 స్క్రిప్‌లు నష్టపోయాయి. 169 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
ఆసియా మార్కెట్లలో షాంఘై, సియోల్, టోక్యో రాణించాయి. హాంకాంగ్ డీలాపడింది. ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
ముంబయిలోని దలాల్ స్ట్రీట్‌లో నడిచే ఎవరైనా సరే.. ఒకసారైనా తలెత్తి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని చూడాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత పురాతమైన, ఘన చరిత్ర ఉన్న ఆ ఎక్స్ఛేంజీ.. ఇపుడు ప్రపంచవ్యాప్తంగా మదుపర్లను ఆకర్షిస్తోంది. సెన్సెక్స్ 50,000 పాయింట్ల శిఖరాగ్రాన నిలిచి.. బుల్ వేసిన రంకె.. ప్రపంచమంతా వినిపించేలా చేసింది. మదుపర్లకు జనవరి 21, 2021ని గుర్తుండిపోయేలా చేసింది. చివర్లో లాభాల స్వీకరణతో ఈ స్థాయికి 375 పాయింట్ల దూరంలో సెన్సెక్స్ నిలిచింది.
తొలి నాళ్లలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ రింగులో అత్యంత హడావుడి మధ్య, పేపరు రూపంలో ఉన్న షేర్ల క్రయ విక్రయాలు జరిగేవి. బ్రోకర్ల అరుపులు చూస్తే.. సాధారణ మార్కెట్‌నే తలపించేది. ఇపుడు ట్రేడింగ్ తీరు మారిపోయింది. డీమ్యాట్‌లో ఉన్న షేర్ల క్రయవిక్రయాలన్నీ కంప్యూటర్ తెరలపై నడిచి పోతున్నాయి. ఎక్కడి నుంచైనా మొబైల్ ద్వారా కూడా షేర్ల ధరలు అనుక్షణం పరిశీలిస్తూ, కొనగలుగుతున్నాం. అమ్మగలుగుతున్నాం.
1990 నాటి 1000 పాయింట్ల నుంచి నేటి 50,000 పాయింట్ల వరకు సెన్సెక్స్ చేసిన ప్రయాణాన్ని చాలా తక్కువ మందే చూసి ఉంటారు. ఈ ప్రయాణంలో ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి వంటి పూలే కాదు.. ఆర్థిక మాంద్యం, కుంభకోణాలు, సంక్షోభాల వంటి ముళ్లూ ఉన్నాయి. అన్నీ తట్టుకునే బుల్ ఈ స్థాయికి చేరింది.
ప్రయాణం.. ఇలా మొదలు..
1875లోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ ఏర్పాటైంది.. ఆ తర్వాత 111 ఏళ్లకు అంటే.. 1986లో సెన్సెక్స్ ఏర్పడింది. తొలుత దీనిని 100 పాయింట్లతో ప్రారంభించారు. ప్రాతిపదిక ఏడాదిని 1978-79గా తీసుకున్నారు. సెన్సెక్స్ పేరు ఎలా వచ్చిందన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. సెన్సిటివ్, ఇండెక్స్ పదాలను కలిపి దీపక్ మొహానీ అనే ఒక స్టాక్‌మార్కెట్ విశ్లేషకుడు సెన్సెక్స్‌కు నామకరణంగా చేశాడు.
కీలక మైలురాళ్లు ఎపుడంటే..
సెన్సెక్స్ ఏర్పడ్డ నాలుగేళ్లకు అంటే 1990ల్లో అది 1000 పాయింట్ల స్థాయిని అధిగమించింది.అప్పట్లో సకాలంలో కురిసిన వర్షాలకు తోడు.. కంపెనీలు మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించడం ఇందుకు కారణమైంది. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత బుల్ అసలు పరుగు మొదలైందని చెప్పాలి. ఆ దూకుడుకు 1992 ఏప్రిల్‌లో హర్షద్ మెహతా కుంభకోణం అడ్డుకట్టవేసింది. అక్కడి నుంచి 5000 పాయింట్లకు చేరుకోవడానికి సెన్సెక్స్‌కు దాదాపు పదేళ్ల సమయం పట్టింది. భాజపా ఆధ్వర్యంలోని ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఆ తరుణంలో 1999న అక్టోబరు 11న 5,000 పాయింట్లకు చేరగలిగింది.
బీఎస్‌ఈ ఒక కార్పొరేట్ సంస్థగా మారిన ఏడాది తర్వాత అంటే 2006లో తొలిసారిగా సెన్సెక్స్ 10,000 పాయింట్లను అధిగమించింది. ఆ తర్వాతి ఏడాదే 20,000 పాయింట్లకు చేరుకోగలిగింది. కానీ 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో సెన్సెక్స్ చక్రాలకు స్పీడు బ్రేకులు ఎదురయ్యాయి. భారీ నష్టాలను మూటగట్టుకుంది. మళ్లీ కీలక మైలురాయిని అందుకోడానికి 2014 మే 16న మోదీ ప్రమాణ స్వీకారం చేసేదాకా ఆగాల్సి వచ్చింది. అప్పుడు సెన్సెక్స్ 25,000 పాయింట్లను అధిగమించింది.
మోదీ పగ్గాలు చేపట్టాక..
2014లో నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టాక సెన్సెక్స్‌కు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. 2015లో 30,000 పాయింట్లను; ఆ తర్వాత మూడేళ్లకు 35,000 పాయింట్లను అధిగమించిన సెన్సెక్స్.. మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక అంటే 2019 మే 23న 40,000 పాయింట్లను అధిగమించింది. 2020 ఫిబ్రవరి వరకు అదే స్థాయిల్లో సెన్సెక్స్ రాణించింది. ఆ తర్వాత కరోనాతో ప్రపంచమంతా ఒక్క కుదుపునకు లోనైంది. దీంతో 2020 మార్చిలో సెన్సెక్స్ మళ్లీ 25,638 పాయింట్ల స్థాయికి కుంగింది.
10 నెలల్లోనే దాదాపు రెట్టింపు
కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ఆపసోపాలు పడుతోంది. అయితే స్టాక్ మార్కెట్ మాత్రం శరవేగంతో దూసుకెళ్తోంది. 10 నెలల సమయంలోనే దాదాపు రెట్టింపైంది. ఇక 45,000 పాయింట్ల నుంచి 50,000 పాయింట్లకు చేరుకునేందుకు అయితే 35 ట్రేడింగ్ రోజులే సరిపోయాయంటే, మార్కెట్ దూకుడు అర్థమవుతుంది. గిరాకీ క్రమంగా పెరుగుతుండడం, కొవిడ్ టీకాలు రావడం, అమెరికా, ఐరోపా, భారత్‌లు ఉద్దీపన చర్యలను భారీగా చేపట్టడం, కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో పాటు భవిష్యత్‌పై సానుకూల వ్యాఖ్యలు చేస్తుండడంతో ఈ ర్యాలీ సాధ్యమైందని చెప్పాలి. ఆ ర్యాలీలో భాగంగానే జనవరి 21, 2021న సెన్సెక్స్ 50,000 పాయింట్ల చరిత్రాత్మక మైలురాయిని అధిగమించింది.
ఎవరికీ అర్థం కాదు..
సెన్సెక్స్ పరుగు అటు చిన్న మదుపర్లకే కాదు.. కొమ్ములు తిరిగిన పెట్టుబడిదార్లకూ అర్థం కాదు. ఎందుకంటే.. ఆర్థిక వ్యవస్థ బాగుంటే అంతా బాగున్నట్లు. కానీ ఆర్థిక వ్యవస్థ సగటున 8 శాతం వృద్ధితో వెళుతున్నపుడు స్టాక్‌మార్కెట్లలో పెద్దగా లాభాలు రాలేదు. ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంతగా మాంద్యంలోకి జారిన ఈ సమయంలో మాత్రం, సెన్సెక్స్ సుమారు రెట్టింపు లాభం ఆర్జించింది. అపుడూ.. ఇపుడూ ఏ గణాంకాల గణనకూ లోబడకుండా దాని పయనం సాగుతోంది.