తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​బీఐలో స్వచ్ఛంద విరమణ పథకం

మానవ వనరుల సమర్థ వినియోగంపై భారతీయ స్టేట్ బ్యాంకు దృష్టి సారించింది. ఇందులో భాగంగా తన ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్​ఎస్​) తీసుకురావాలని నిర్ణయించింది. డిసెంబర్​ 1నుంచి ఫిబ్రవరి వరకు ఏటా 3 నెలల పాటు ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపింది.

sbi-vrs
స్వచ్ఛంద విరమణ పథకం

By

Published : Sep 3, 2020, 7:36 AM IST

భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) తన ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(వీఆర్‌ఎస్‌) తీసుకురావాలని నిర్ణయించింది. ఈ 'సెకండ్‌ ఇన్నింగ్స్‌ టాప్‌- వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌-2020' (ఎస్‌ఐటీవీఆర్‌ఎస్‌-2020) ద్వారా మానవ వనరులను, వ్యయాలను సమర్థంగా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది.

డిసెంబరు 1 నుంచి ఫిబ్రవరి చివర వరకు ఏటా మూడు నెలల పాటు ఇది అమల్లో ఉంటుంది. ప్రతిపాదిత అర్హత ప్రమాణాల ప్రకారం.. మొత్తం 11,565 మంది అధికారులు(జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌-1 నుంచి టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌ స్పెషల్‌ స్కేల్‌-1 వరకు); 18625 మంది సిబ్బంది(క్లరికల్‌, సబ్‌ స్టాఫ్‌)కి ఈ పథకం కింద అర్హత ఉంటుంది.

ఒక వేళ ఈ పథకం కింద 30 శాతం మంది పదవీ విరమణను ఎంచుకుంటే.. జులై 2020 నెల వేతనం ప్రకారం.. బ్యాంకుకు రూ.2,170.85 కోట్ల మేర నికరంగా మిగులుతుంది. మార్చి 2020 చివరకు ఎస్‌బీఐ సిబ్బంది సంఖ్య 2,49,448గా ఉంది. సిబ్బంది వ్యయాలను తగ్గించుకుని.. ఉత్పాదకతను మెరుగుపరచుకోవాలని భావిస్తున్నట్లు 2019-20 నాలుగో త్రైమాసికంలోనే ఎస్‌బీఐ స్పష్టం చేసింది.

  • ఎస్‌బీఐ(విలీనం అయిన ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు సిబ్బంది సైతం)లోని అందరు శాశ్వత అధికారులు, సిబ్బందికి ఈ వీఆర్‌ఎస్‌ వర్తిస్తుంది.
  • అయితే దరఖాస్తు చేసే నాటికి 25 ఏళ్ల సర్వీసు, 55 ఏళ్ల వయసును పూర్తి చేసి ఉండాలి. మూడు లేదా నాలుగు ప్రమోషన్‌ అవకాశాలను కోల్పోయిన అధికారులకు ఇది వర్తిస్తుంది.
  • వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే ఉద్యోగులకు మిగిలిన సర్వీసుకు గాను వేతనంలో 50 శాతం వరకు ఎక్స్‌ గ్రేషియాగా అందిస్తారు.(చివరగా వేతనం తీసుకున్న నాటి నుంచి గరిష్ఠంగా 18 నెలలు).

యూనియన్ల మాట ఇదీ..

"ప్రస్తుత సమయంలో మన సహోద్యోగులు వీఆర్‌ఎస్‌ వైపునకు మళ్లొద్దు. విలువైన ఉద్యోగాలను, కష్టపడి పనిచేసిన సొమ్మును విడవొద్దు" అని అఖిల భారత ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘం సాధారణ కార్యదర్శి కేఎస్‌ కృష్ణ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నేడు బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీల అధినేతలతో ఆర్థికమంత్రి భేటీ

ABOUT THE AUTHOR

...view details