తెలంగాణ

telangana

ETV Bharat / business

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు ఊరట - Carlyle PNB deal

కార్లైల్‌ గ్రూపుతో పీఎన్​బీ హైసింగ్​ ఫైనాన్స్​ ఒప్పందానికి లైన్ క్లియర్​ అయ్యింది. ఒప్పంద ప్రతిపాదనపై వాటాదార్ల ఓటింగ్ ప్రక్రియను నిలిపివేయాలంటూ సెబీ ఇచ్చిన ఆదేశాలను సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ పక్కనపెట్టింది.

Carlyle PNB deal
పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌

By

Published : Jun 22, 2021, 5:39 AM IST

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు ఊరట దక్కింది. కార్లైల్‌ గ్రూపుతో ప్రతిపాదిత రూ.4000 కోట్ల ఒప్పందానికి సంబంధించి వాటాదార్ల సమావేశాన్ని మంగళవారం (ఈనెల 22న) నిర్వహించుకోడానికి సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(శాట్‌) అనుమతులు ఇచ్చింది. ఈ ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ ఈనెల 18న సెబీ జారీ చేసిన ఆదేశాలను పక్కనపెట్టింది. అయితే ట్రైబ్యునల్‌ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాటాదార్ల ఓటింగ్‌ ఫలితాలను బయటకు వెల్లడించరాదని శాట్‌ ఆదేశించింది.

వేగంగా నిర్ణయం:నమోదిత స్వతంత్ర విలువ మదింపుదారుతో కంపెనీ షేర్ల విలువను లెక్కగట్టేంత వరకు ప్రతిపాదిత నిధుల సమీకరణను వాయిదా వేయాలంటూ సెబీ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ శాట్‌కు వెళ్లినట్లు ఎక్స్ఛేంజీలకు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపిన గంటల్లోనే ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్‌) జూన్‌ 22(నేడు)న నిర్వహించాలని కంపెనీ ఇది వరకే నిర్ణయించింది.

డైరెక్టర్ల మధ్య అభిప్రాయభేదాలు!: ప్రిఫరెన్షియల్‌ షేర్లు, వారెంట్ల జారీ ద్వారా మూలధన నిధులు సమీకరించాలన్న పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ప్రణాళిక కారణంగా మైనారిటీ వాటాదార్ల ప్రయోజనాలు దెబ్బతినవచ్చని, అదే సమయంలో మార్కెట్‌ ధర కంటే తక్కువకు ఇష్యూ ధరను నిర్ణయించడంపైనా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సెబీ ఆదేశాలు వెలువరించింది. కార్లైల్‌తో కంపెనీలోని కొందరు డైరెక్టర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉండడం వల్ల డైరెక్టర్ల మధ్య అభిప్రాయభేదాలు కూడా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు ధర సోమవారం ఎన్‌ఎస్‌ఈలో 4.99% నష్టంతో రూ.700.95 వద్ద ముగిసింది. కాగా, కంపెనీ ప్రతిపాదిత నిధుల సమీకరణకు ఇష్యూ ధరను రూ.390గా నిర్ణయించడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details