రైల్వేశాఖ తన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ సీసాల క్రషింగ్ యంత్రాలు వినియోగించినవారికి ఫోన్ రీఛార్జ్ చేయనున్నట్లు తెలిపింది.
స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ... ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకూడదని, ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిని అనుసరించి ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి స్టేషన్ పరిసరాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ రైల్వే ఆదేశాలు జారీచేసింది.
ఎంత రీఛార్జ్ చేస్తారు?
రైల్వే స్టేషన్లలో 400 ప్లాస్టిక్ సీసాల క్రషింగ్ యంత్రాలు ఏర్పాటు చేస్తామని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ప్రస్తుతానికి 128 స్టేషన్లలో 160 యంత్రాలు అమర్చినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు వీటిని వినియోగించి ప్లాస్టిక్ సీసాలు క్రషింగ్ చేస్తే వాళ్ల ఫోన్లు రీఛార్జ్ చేస్తామని వెల్లడించారు. అయితే ఎంత మొత్తం రీఛార్జ్ చేస్తారనేది మాత్రం ఇంకా చెప్పలేదు.