దసరా, దీపావళి.. మన దేశంలో ప్రధాన పండుగ సీజన్ ఇదే. ఈ సమయంలో ప్రజలు ఎక్కువ కొనుగోళ్లు జరుపుతుంటారు. బట్టల నుంచి మొదలుకుని ఎలక్ట్రానిక్ ఉపకరణాల వరకు ఈ సమయంలో కొనుగోలు చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.
ప్రత్యేక పరిస్థితులు..
ఈ సారి పండుగ సీజన్ ప్రత్యేక పరిస్థితుల మధ్య వస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో చాలా రోజులు దుకాణాలు ముతబడ్డాయి. లాక్‌డౌన్ సడలించిన తర్వాత కూడా భవిష్యత్తుపై ఆ ఆందోళనలు పోలేదు.
కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, వేతనాల్లో కోతలను చాలా మంది ఎదుర్కొన్నారు. దీనితో గత కొంత కాలంగా ప్రజలు నిత్యావసరాలు మినహా మిగతా వస్తువుల కొనుగోళ్లు చాలా వరకు ఆపేశారు. దీనితో అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వేసవి కాలం లాంటి ప్రధాన షాపింగ్ సీజన్‌ను కంపెనీలు, వ్యాపార సంస్థలు కోల్పోయాయి.
అయితే కొన్ని వారాలుగా పరిస్థితి మెరుగుపడుతోంది. ఆర్థిక కార్యకలాపాలు గాడిన పడుతుండటం వల్ల మార్కెట్‌లో క్రయవిక్రయాలు పెరిగాయి. ఉపాధి అవకాశాలు కూడా మళ్లీ సాధారణ స్థితికి చేరుతున్నాయి.
పండుగ సీజన్‌తో పుంజుకుంటాం..
వినియోగదారులకు కొంత విరామం రావడం, పండుగ ఆఫర్ల వల్ల.. విక్రయాల్లో మంచి వృద్ధి సాధిస్తామని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత మార్కెట్ సాధారణం కంటే 60 శాతం తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే.. ప్రస్తుతం మార్కెట్ 30 శాతం ప్రతికూల వృద్ధిలో ఉంది. ఈ పండుగ సీజన్లో వీటన్నింటిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.