రిలయన్స్ ఇండస్ట్రీస్, తన భాగస్వామి బీపీతో కలిసి ఆసియాలోనే అత్యంత లోతైన ప్రాజెక్టు నుంచి సహజ వాయువు (గ్యాస్) ఉత్పత్తి ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో కేజీ-డి6 బ్లాక్ ఆన్‌స్ట్రీమ్‌లో రెండో దశ నిక్షేపాల నుంచి ఉత్పత్తి మొదలైనట్లయింది. తూర్పు ఆఫ్‌షోర్ బ్లాకులో రిలయన్స్-బీపీలు అభివృద్ధి చేస్తున్న మూడు డీప్ సీ (అత్యంత లోతైన సముద్ర) ప్రాజెక్టుల్లో ఒకటైన సముద్రగర్భ ఆర్-క్లస్టర్ నుంచి తాజాగా ఉత్పత్తి ప్రారంభించినట్లు రెండు కంపెనీలు తెలిపాయి.
ఆర్ క్లస్టర్ నుంచి గరిష్ఠంగా 12 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీ) ఉత్పత్తి పొందొచ్చు. మరో ప్రాజెక్టు అయిన శాటిలైట్స్ క్లస్టర్ 2021లో (గరిష్ఠంగా 7 ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీ) మొదలు కానుంది. ఎమ్‌జే క్షేత్రం నుంచి 2022 మూడో త్రైమాసికం నుంచి ఉత్పత్తి ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. దీని గరిష్ఠ ఉత్పత్తి సామర్థ్యం ఆర్-క్లస్టర్‌తో సమానంగా ఉంటుంది.