బిట్‌కాయిన్ వంటి ప్రైవేటు క్రిప్టో కరెన్సీకి ముకుతాడు వేసి, సొంత క్రిప్టో కరెన్సీ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దాన్ని రూపొందించే బాధ్యతలు అప్పగించనుంది. దీనికి సంబంధించిన బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు విడతలుగా జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం మొత్తం 20 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా క్రిప్టో కరెన్సీ నియంత్రణ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లును తీసుకురానుందని సమాచారం.
ఆర్‌బీఐ నుంచి క్రిప్టో కరెన్సీ.. ఈ సమావేశాల్లోనేనా? - ఆర్‌బీఐ క్రిప్టో కరెన్సీ
బిట్ కాయిన్ లాంటి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను పక్కనపెట్టి సొంతంగా క్రిప్టో కరెన్సీని తెచ్చేందుకు కసరత్తులు చేస్తోంది కేంద్రం. ఈ కరెన్సీని రూపొందించే బాధ్యతలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించనుంది. దీనికి సంబంధించిన బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టే యోచనలో కేంద్రం ఉంది.
బిట్‌కాయిన్ విలువ ఎన్నడూ లేనంతగా ఇటీవల పెరగడంతో క్రిప్టోకరెన్సీకి ఆదరణ పెరిగింది. దేశీయంగానూ ఈ తరహా కరెన్సీ వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ వినియోగం శ్రేయస్కరం కాదని భావించిన ఆర్‌బీఐ.. 2018లో దేశంలో నిషేధించింది. అయితే, ఆర్‌బీఐ ఉత్తర్వులను సుప్రీంకోర్టు 2020లో కొట్టివేసింది. దీంతో చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2019లో సైతం ఇలాంటి క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిల్లును ప్రభుత్వం సిద్ధం చేసింది. క్రిప్టోకరెన్సీ కొనుగోలు చేయడం, విక్రయించడాన్ని నేరంగా పరిగణిస్తూ 10 ఏళ్ల జైలు శిక్ష విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించింది. తాజాగా మరోసారి అలాంటి బిల్లునే కేంద్రం సిద్ధం చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి :పర్యటకానికి అత్యంత చెత్త సంవత్సరంగా '2020'