భారతీయ ఉద్యోగుల్లో తమ ఆదాయం, పొదుపులు పెరుగుతాయనే విశ్వాసం పెరిగినట్ల తెలిసింది. వచ్చే ఆరు నెలల్లో ఆదాయంతో పాటు వ్యక్తిగత అవసరాలకు ఖర్చులు పెరుగుతాయని భావిస్తున్నట్లు లింక్డ్ ఇన్ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ఒకరు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సర్వే వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 1,351 మందిపై జూన్ 1వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించింది లింక్‌డ్‌ఇన్. ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆర్థికస్థితిపై దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు పేర్కొంది. ఇంతకు ముందు మేలో చేసిన సర్వేతో పోలిస్తే ఉద్యోగుల్లో భద్రతాభావం కూడా మెరుగైనట్లు వెల్లడించింది.
అప్పుడలా.. ఇప్పుడిలా..
మే 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చేసిన సర్వేలో 1,646 మంది పాల్గొనగా 20శాతం మంది తమ ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. 27శాతం మంది మిగులు, 23శాతం మంది ఖర్చులు పెరుగుతాయని తెలిపారు. ఈ మధ్యే జరిపిన సర్వేలో ముగ్గురిలో ఒకరు తమ వ్యక్తిగత మిగులు, వ్యక్తిగత రికరింగ్ అప్పుల చెల్లింపులు పెరుగుతాయని తెలిపినట్లు లింక్‌డ్‌ఇన్ ఉద్యోగుల ఆత్మవిశ్వాస సూచీలో తేలింది.