తెలంగాణ

telangana

ETV Bharat / business

సిరి: డీమ్యాట్ ఖాతా సులువుగా తెరవండిలా... - సిరి

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాల‌ని చాలా మందికి ఆస‌క్తి ఉంటుంది. అయితే అందుకు డీమెటీరియలైజేషన్‌ (డీమ్యాట్‌) ఖాతా తప్పనిసరిగా ఉండాలి. బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేసిన విధంగానే షేర్లు, డిబెంచ‌ర్లు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉంచాలి. డీమ్యాట్‌ ఖాతా ద్వారా వీటి లావాదేవీలు జ‌ర‌ప‌వ‌చ్చు.

సిరి: డీమ్యాట్ ఖాతా తెరిచే విధానం చూద్దామా?

By

Published : Jul 29, 2019, 5:31 PM IST

సులభంగా డబ్బులు సంపాదించడానికి ఎక్కువ మంది స్టాక్​ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. అయితే ఇందుకోసం డీమెటీరియలైజేషన్​ (డీమ్యాట్​) ఖాతా తప్పనిసరి. అసలు ఈ డీమ్యాట్​ ఖాతా ఎలా తెరవాలి? ఏ సంస్థలు అందిస్తాయి? ఈ విషయాలు తెలుసుకుందాం.

అందించే సంస్థ‌లు...

డీమ్యాట్ ఖాతాలు ఈ రెండు డిపాజిట‌రీల్లో ఏదైనా ఒక దాని వ‌ద్ద రిజిస్ట‌ర్ అయి ఉంటాయి.

సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీడీఎస్‌ఎల్‌)

నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌)

డిపాజిట‌రీల ఆధ్వ‌ర్యంలో డిపాజిట‌రీ పార్టిసిపెంట్‌లు(డీపీ) ప‌నిచేస్తాయి. సెబీ మార్గదర్శకాల మేరకు షేర్ బ్రోకర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కస్టోడియన్లు డీపీలుగా వ్యవహరిస్తాయి.

ఉదాహరణ:

  1. ఎస్‌బీఐ క్యాప్ సెక్యూరిటీస్
  2. ఐసీఐసీఐ
  3. యాక్సిస్ బ్యాంకు లిమిటెడ్
  4. కోటక్ సెక్యూరిటీస్
  5. షేర్ ఖాన్ లిమిటెడ్ మొదలైనవి.

ఖాతా తెరిచేందుకు:

ఒక వ్యక్తి స్వ‌యంగా లేదా ఉమ్మడిగా డీమ్యాట్‌ ఖాతా తెరవచ్చు. మైనర్‌ పేరుపై ఖాతా తెరిచేందుకు సంరక్షకుని పర్యవేక్షణ అవ‌స‌రం. డీమ్యాట్ ఖాతా ప‌రంగా సేవ‌ల నాణ్య‌త‌, ఛార్జీల వసూలు, టెక్నిక‌ల్‌ అనుకూలతలను అందించే దాన్ని బ‌ట్టి డిపాసిటరీ పార్టిసిపెంట్‌ (డీపీ)ను ఎంపిక చేసుకోవ‌డం మంచిది. దరఖాస్తు పత్రంతోబాటు అనుబంధ ప‌త్రాలు, సంబంధిత వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

కావల్సినవి..

  • సెబీ నిబంధనల మేరకు డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాను తెరిచేందుకు పాన్‌ కార్డు తప్పనిసరి.
  • రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు

బ్యాంకు వివరాల ధ్రువీకరణకు :

  • బ్యాంకు స్టేట్‌మెంట్‌ కాపీ
  • బ్యాంక్‌ పాస్‌బుక్‌ మొదటి పేజీ కాపీ
  • క్యాన్సిల్‌ చేసిన చెక్ … ఈ మూడింటిలో ఏదైనా ఒక‌టి

చిరునామా ధ్రువీకరణకు..

  1. ఆధార్ కార్డు కాపీ
  2. పాసుపోర్టు కాపీ
  3. ఓటరు కార్డు కాపీ
  4. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కాపీ
  5. బ్యాంక్‌ పాస్‌బుక్‌ కాపీ
  6. కరెంట్‌, టెలిఫోన్‌ బిల్లు
  7. లీజు, రెంట్‌ ఒప్పంద పత్రం
  8. రేషన్‌ కార్డు కాపీ
  9. ప్రభుత్వం/బ్యాంకులు/కళాశాలలు/ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే చిరునామా, గుర్తింపు పత్రాలు

ఒకసారి కేవైసీ ధ్రువీకరణ జరిగాక ఇంకో డీమ్యాట్‌ లేదా ట్రేడింగ్‌ ఖాతా తెరిచేందుకు తిరిగి ఈ పత్రాలన్నీ సమర్పించాల్సిన అవసరం లేదు.

తెరిచాక అందాల్సిన పత్రాలు:

  • ఖాతాదారుకు ప్రత్యేకంగా కేటాయించిన గుర్తింపు సంఖ్య…బెనిఫిషియల్‌ ఓనర్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (బీవోఐడీ).
  • ఈ గుర్తింపు సంఖ్యను డీపీ, రిజిస్ట్రార్‌, ఏజెంట్లకు, సీడీఎస్‌ఎల్‌ / ఎన్‌ఎస్‌డీఎల్‌ తో సంప్రదించేటప్పుడు పేర్కోవాలి.
  • సంతకం చేసిన అగ్రిమెంటు కాపీ లేదా పవర్‌ ఆఫ్‌ అటార్నీ కాపీ

రుసుములు

డీమ్యాట్ ఖాతాను నిర్వ‌హించేందుకు, అద‌న‌పు సేవ‌లు అందించేందుకుగాను డిపాజిట‌రీ పార్టిసిపెంట్‌లు వివిధ ర‌కాల రుసుములు వ‌సూలు చేస్తాయి. ఖాతా రకాన్ని, అందించే సేవలను బట్టి వ‌సూలు చేసే ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి.

డీమ్యాట్‌ ఖాతాదారుకు లభించే ఉచిత సదుపాయాలు:

ఇంటర్నెట్‌ సేవలు:

డీమ్యాట్‌ ఖాతా కోసం రిజిష్టర్‌ చేసుకున్న త‌ర్వాత‌ షేర్లు, రిపోర్టులు, ఇతర వివరాలు ఏ సమయంలోనైనా ఇంట‌ర్నెట్ స‌హాయంతో ఉచితంగా చూసుకునే అవకాశం ఉంటుంది.

బదిలీ:

ఖాతాలోని షేర్లను ఒక డీమ్యాట్‌ ఖాతా నుంచి మరోదానికి బదిలీ చేసుకోవచ్చు.

ఐపీవోల దరఖాస్తు:

డీమ్యాట్‌ ఖాతా ద్వారా సులభంగా ఐపీవోలకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. అలాట్ అయిన షేర్లు నేరుగా డీమ్యాట్‌ ఖాతాకే బదిలీ అవుతాయి. బోనస్‌ షేర్లు, రైట్‌ ఇష్యూలో కొన్న షేర్లు మొద‌లైన‌వ‌న్నీ ఖాతాకు బదిలీ అవుతాయి.

ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌:

అన్ని డెబిట్‌, క్రెడిట్‌ లావాదేవీలు, ఐపీవో క్రెడిట్స్‌, బోనస్‌ వివరాలు, విఫలమైన, ఓవర్‌డ్యూ డెబిట్‌ సూచనలు, చిరునామా, మొబైల్‌ నంబరు మార్పు, తనఖా పెట్టిన షేర్ల వివరాలు, పవర్‌ ఆఫ్‌ అటార్నీ రిజిస్ట్రేషన్‌, డీ రిజిస్ట్రేషన్‌ తదితర వివరాలు వెంటనే ఖాతాదారులకు ఎస్‌ఎంఎస్‌ అలర్టుల రూపంలో వ‌స్తాయి.

డీ మ్యాట్ ఖాతా కలిగి ఉండడం వ‌ల్ల‌ ఎంతో సులభంగా అన్ని రకాల పెట్టుబడులను ఒకే ఖాతా నుంచి నిర్వహించుకోవడంతో బాటు ఆ లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

ఇదీ చూడండి: సిరి: అప్పుడప్పుడూ క్రెడిట్ కార్డు వాడకం మంచిదే

ABOUT THE AUTHOR

...view details