ఉత్పత్తి తగ్గింపుపై ఒపెక్, మిత్రదేశాల మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో సోమవారం చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. కరోనా ధాటికి విలవిలలాడుతున్న ఇంధన మార్కెట్లకు మద్దతు ఇవ్వడానికి... ఒపెక్ దేశాలు వేగంగా చర్యలు తీసుకుంటాయనే ఆశలు మసకబారుతున్నాయి.
యూఎస్ బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్... ఆసియాలో ఒకానొక దశలో 8 శాతం వరకు పడిపోయింది. తరువాత 5.7 శాతం వరకు పుంజుకుంది. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 26.72 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 4.3 శాతం క్షీణించి 32.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
పతనానికి కారణం
కరోనా ప్రభావం, రష్యా, సౌదీ అరేబియా మధ్య ధరల యుద్ధం కారణంగా మునుపెన్నడూ చూడని స్థాయిలో చమురు ధరలు పతనమవుతున్నాయి. ఇది చమురు ఎగుమతిపై ప్రధానంగా ఆధారపడిన ఒపెక్ దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
ప్రయాణ ఆంక్షలు, వ్యాపారాలు మూతపడడం, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న ఇతర చర్యలు కూడా చమురు డిమాండ్‌ను దెబ్బతీస్తున్నాయి.