తెలంగాణ

telangana

ETV Bharat / business

రాజీవ్ కుమార్ 'మాంద్యం థియరీ'పై దుమారం - niti

భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంపై నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు  రాజీవ్​ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన 70 ఏళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితులను ప్రస్తుత ప్రభుత్వం చవిచూస్తోందని చెప్పారు. రాజకీయ విమర్శల నేపథ్యంలో... నష్టనివారణ చర్యలు చేపట్టారు. కేంద్రం, ఆర్​బీఐ చర్యలతో ఈ సవాళ్లను అధిగమించవచ్చని ధీమా వ్యక్తం చేశారు రాజీవ్​.

'70 ఏళ్లలో ఇలాంటి ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ లేదు'

By

Published : Aug 23, 2019, 6:24 PM IST

Updated : Sep 28, 2019, 12:34 AM IST

భారత ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్​ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. గడచిన 70 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రస్తుతం భారత్ వృద్ధి మందగమనాన్ని ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.

ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రస్తుతం తీవ్ర ఒడుదొడుకుల్లో ఉందని.. ఎవరూ ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఏర్పడిందన్నారు రాజీవ్​. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం సరైన సమయంలో తగు చర్యలకు ఉపక్రమిస్తుందన్నారు. ఆ చర్యలు ఆర్థిక మందగమనాన్ని తొలగించడం సహా భారత ఆర్థిక వ్యవస్థను ఒత్తిళ్ల నుంచి బయటపడేస్తుందని ధీమాగా చెప్పారు రాజీవ్.

కేంద్రం, ఆర్బీఐ చర్యలు

పరిస్థితి చక్కదిద్దేందుకు ఇప్పటికే కేంద్రంతో పాటు ఆర్​బీఐ అనేక చర్యలు తీసుకున్నాయని తెలిపారు రాజీవ్​. ద్రవ్యలభ్యత విషయంలో కొద్ది నెలలుగా ఆర్​బీఐ తీసుకున్న చర్యలతో స్థిరత్వం వచ్చిందన్నారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ప్రభుత్వరంగ బ్యాంకులు నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో వరుసగా నాలుగు సార్లు రెపో రేటు తగ్గించడం సహా రుణగ్రహీతలకు తక్కువ వడ్డీలకు రుణాలు అందుతున్నాయని చెప్పారు. ఎన్​బీఎఫ్​సీల ఆస్తులు ప్రభుత్వ రంగ బ్యాంకులు కొనుగోలు చేసేలా కేంద్రం కూడా చర్యలు తీసుకుందని రాజీవ్​ తెలిపారు

విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్​

రాజీవ్ కుమార్ వ్యాఖ్యలతో నరేంద్రమోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టింది కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వ సలహాదారులే దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదనే విషయాన్ని ఒప్పుకొంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. ఆర్థిక పరిస్థితిపై ఎప్పటి నుంచో ప్రభుత్వానికి కాంగ్రెస్ హెచ్చరికలు చేస్తున్నా.. కేంద్రం పెడచెవిన పెడుతూ వచ్చిందని విమర్శించారు.

ఇప్పటికైనా తాము చెబుతున్నట్లు చేయాలని, కేంద్రం డబ్బులను అవసరమున్న పేదల చేతుల్లో పెట్టాలి కాని ఎగ్గొట్టి పోయే వాళ్లకు ఇవ్వడం సరి కాదని ట్వీట్ చేశారు రాహుల్​.

'నా మాటలు వక్రీకరించొద్దు'

తన వ్యాఖ్యలపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాక... రాజీవ్​ స్పందించారు. ప్రస్తుత అర్థిక పరిస్థితుల సవాళ్లను ప్రభుత్వం అధిగమించగలదని ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని చెప్పారు. ఆర్థిక వృద్ధికి ఇవి దోహదపడతాయన్నారు. తన మాటలను వక్రీకరించవద్దని సూచించారు.

ఇదీ చూడండి: వృద్ధికి దారేది...?: నిర్మల ప్రెస్​మీట్​ లైవ్​

Last Updated : Sep 28, 2019, 12:34 AM IST

ABOUT THE AUTHOR

...view details