తెలంగాణ

telangana

ETV Bharat / business

మ్యూచువల్‌ ఫండ్ల సంఖ్యను తగ్గించుకోవడం మేలేనా? - మ్యూచువల్‌ ఫండ్లు లేటెస్ట్ న్యూస్

Mutual Funds News: మదుపర్లు ఒకే తరహా మ్యూచువల్​ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు వైవిధ్యం ఇచ్చే ప్రయోజనాలను కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే, ఫండ్ల జాబితాను కనీసం ఏడాదికోసారైనా సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు.

mutual funds news
మ్యూచువల్‌ ఫండ్లు

By

Published : Feb 18, 2022, 12:54 PM IST

Mutual Funds News: దీర్ఘకాలిక వ్యూహంతో మదుపు చేసేవారికి మ్యూచువల్‌ ఫండ్లు అనువైన పెట్టుబడి మార్గం. క్రమానుగత పెట్టుబడి విధానంలో నెలకు నిర్ణీత మొత్తాన్ని వీటికి కేటాయించొచ్చు. పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవాలనుకున్నప్పుడల్లా కొత్త పథకాన్ని జాబితాలో చేర్చుకుంటూ వెళ్లడం చాలామందికి అలవాటు. దీనివల్ల ఎంతోమంది డజనుకు పైగా ఫండ్లలో మదుపు చేస్తుంటారు. ఎన్ని ఫండ్లలో మదుపు చేయాలన్న దానికి ఒక స్థిరమైన సూత్రమేమీ లేకపోయినా.. ఒకే తరహా ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు వైవిధ్యం ఇచ్చే ప్రయోజనాలను కోల్పోతాం. అందుకే, ఫండ్ల జాబితాను కనీసం ఏడాదికోసారైనా సమీక్షించుకోవాలి.

లక్ష్యానికి దూరంగా: ఏ పథకాన్నైనా ఎంచుకునేటప్పుడు దానికి మీ ఆర్థిక లక్ష్యాన్ని ముడిపెట్టాలి. అంతేకానీ, ఎవరో చెప్పారని పథకంలో మదుపు చేయొద్దు. నష్టభయం భరించే సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలు, మొత్తం పెట్టుబడుల కేటాయింపులాంటివి ఫండ్‌ ఎంపికలో కీలకం. మీ లక్ష్యం, పెట్టుబడి వ్యవధి, ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా అర్థం చేసుకున్న తర్వాతే.. అందుకు అనుకూలంగా ఉన్న పథకంలో పెట్టుబడి ప్రారంభించాలి. ఒకవేళ మీరు అనుకున్న లక్ష్యానికి సరిపోని ఫండ్‌లో మీరు మదుపు చేస్తుంటే.. నిర్మొహమాటంగా దాని నుంచి బయటకు వచ్చేయండి. ఉదాహరణకు మీకు రెండేళ్లలో డబ్బు కావాలి.. ఇలాంటప్పుడు ఈక్విటీ ఫండ్లు ఏమాత్రం అనుకూలం కాదు.

ఒకే తరహాలో ఉంటే: పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండాలి. ఒకే తరహా, విభాగానికి చెందిన ఫండ్లు ఉంటే ఫలితం ఉండదు. 4-5 ఫండ్లు లార్జ్‌ క్యాప్‌ లేదా ఇండెక్స్‌ ఫండ్లు ఉన్నాయనుకోండి.. అప్పుడు ఇతర విభాగాల్లో వచ్చే లాభాలను కోల్పోయినట్లే. కాబట్టి, మీ ఫండ్లను ఒకసారి సమీక్షించుకొని, ఒకే తరహాలో ఉన్న ఫండ్ల సంఖ్య తగ్గించుకోవాలి.

పనితీరు చూసుకొని:మదుపు చేసినప్పుడు పనితీరు బాగానే ఉండొచ్చు. కాలక్రమేణా ఇచ్చే రాబడి ప్రామాణిక సూచీలతో పోలిస్తే తగ్గిపోవచ్చు. ఇలాంటి ఫండ్లు మీ జాబితాలో ఉన్నాయా చూసుకోండి. ఒకటి రెండు నెలల్లోనే నిర్ణయం తీసుకోకుండా.. కనీసం 6 నెలల వరకూ గడువు ఇవ్వాలి. అప్పటికీ ఫండ్‌ పనితీరు బాగా లేదని భావిస్తే అందులో పెట్టుబడులు ఆపేయాలి.

కొత్త పథకాలు: ఇప్పుడు అనేక ఎన్‌ఎఫ్‌ఓలు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటన్నింటిలోనూ మదుపు చేయాలని అనుకోవద్దు. వీటివల్ల మీ దగ్గర ఫండ్ల సంఖ్య పెరగడం తప్ప ప్రయోజనం ఉండదు. వచ్చిన ఎన్‌ఎఫ్‌ఓల్లో మీ దగ్గర లేని విభాగంలోని పథకం ఉందా చూసుకోండి. లేకపోతేనే కొత్త పథకం గురించి ఆలోచించండి.

ఒక పథకంలో పెట్టుబడి ఆపేసిన తర్వాత వెంటనే అందులో ఉన్న మొత్తాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయొద్దు. క్రమానుగతంగా వెనక్కి తీసుకుంటే.. మీరు అనుకుంటున్న పథకానికి మళ్లించాలి. ఏడాదిలోపు పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే అమ్మకపు రుసుము ఉండే అవకాశం ఉంటుంది.

ఏడాదిలోపు ఈక్విటీ ఫండ్లపై వచ్చిన లాభాలపై 15 శాతం పన్ను వర్తిస్తుంది. ఫండ్ల సంఖ్య తగ్గించుకునే క్రమంలో ఈ విషయాలనూ గమనించాలి.

ఇదీ చూడండి:క్రిప్టో కరెన్సీలో మదుపు చేయాలనుకుంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details