వివిధ కారణాలతో వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభించడం మంచిది కాదని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. కొంతమంది డీమ్యాట్ ఖాతా కోసం ఒకటి, గృహ రుణాల కోసం మరొకటి. వేతన ఖాతా కోసం ఇంకొకటి.. ఇలా ఒక్కోదానికి ఒక్కో బ్యాంకు ఖాతా వినియోగిస్తుంటారు. ఇవి కాకుండా ఉద్యోగాలు మారినప్పుడు వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభిస్తుంటారు. అయితే అన్ని ఖాతాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండలేం. ఒకవేళ ఖాతాల్లో కనీస నిల్వ లేకుంటే ఛార్జీలు పడతాయి. అందుకే ఎంతో కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఎక్కువ ఖాతాలు ఉంటే..?
ఎక్కువ ఖాతాలు ఉంటే అన్ని ఖాతాల్లో కొంత డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు బ్యాంకుల్లో కనీస నిల్వ రూ.5000 నుంచి రూ.10 వేల వరకు ఉండాలి. అంటే, మీకు ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయనుకుంటే రూ.25,000 నుంచి రూ.50,000 వేల వరకు ఖాతాల్లో ఉండిపోతుంది. ఒక బ్యాంకు ఖాతాను అసలు ఉపయోగించకపోతే దానిని మూసివేయడమే మంచిది. బ్యాంకుల్లో ఉన్న కనీస నిల్వలపై 3-4 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. అదే మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెడితే దానికంటే రెట్టింపు వడ్డీ లభిస్తుంది. అంతేకాకుండా పొదుపు ఖాతాలపై ఇతర ఛార్జీలు, అంటే డెబిట్ కార్డ్ ఛార్జీలు వంటివి వర్తిస్తాయి. మీ వేతన ఖాతా లేదా జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలో వరుసగా మూడు నెలలు ఎలాంటి డిపాజిట్ చేయకపోతే ఆ తర్వాత అది సాధారణ పొదుపు ఖాతాగా మారుతుంది. అప్పుడు కచ్చితంగా కనీస నిల్వలను నిర్వహించాల్సి ఉంటుంది. కనీస నిల్వ లేనప్పుడు బ్యాంకులు తగిన ఛార్జీలు కూడా విధిస్తాయి.
ఖాతాల నుంచి వరుసగా రెండేళ్ల కంటే ఎక్కువ కాలం లావాదేవీలు చేయకపోతే దానిని బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తాయి. అప్పుడు ఖాతా నుంచి డెబిట్ కార్డ్, చెక్కులు, ఆన్‌లైన్, మొబైల్ లావాదేవీలు జరిపేందుకు వీలుండదు. ఆ ఖాతాను యాక్టివేట్ చేసేందుకు రాతపూర్వకంగా అభ్యర్థించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖాతా అయితే ఖాతాదారులందరి సమ్మతి కావాలి. దీంతో ఆయా ఖాతాల్లో ఉన్న డబ్బులతో ఎలాంటి రాబడీ రాకపోగా, ఆదాయ పన్ను రిటర్నుల సమయంలో అన్ని ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లావాదేవీల కోసం అన్ని పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకోవడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది.