కొవిడ్-19 చికిత్సలో వినియోగానికి వీలుగా 'మోల్నుపిరవిర్' ఔషధం తయారీ, విక్రయ హక్కులను మనదేశానికి చెందిన 5 జనరిక్ ఔషధాల తయారీ కంపెనీలకు ఇస్తూ అమెరికా ఫార్మా దిగ్గజమైన ఎంఎస్‌డీ ఫార్మా (మెర్క్ షార్ప్ అండ్ డోహ్మ్) 'లైసెన్సింగ్ ఒప్పందం' కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల్లో సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఎమ్‌క్యూర్ ఫార్మా, హెటెరో ల్యాబ్స్ ఉన్నాయి. దీని ప్రకారం ఈ ఔషధాన్ని మనదేశంతో పాటు తక్కువ, మధ్య ఆదాయాలు గల 100 దేశాల్లో విక్రయించే లైసెన్సు ఈ కంపెనీలకు లభిస్తుంది. 'మోల్నుపిరవిర్' ఔషధానికి అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) కి హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా, ఆప్టిమస్ ఫార్మా సొంతంగా దరఖాస్తు చేసుకున్నామని ప్రకటించిన మరునాడే ఎంఎస్‌డీ ఫార్మా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
అమెరికా సహా పలు దేశాల్లో పరీక్షలు
యాంటీ- వైరల్ తరగతికి చెందిన మోల్నుపిరవిర్ ఔషధం కొవిడ్-19 వ్యాధిగ్రస్తులపై ఏ మేరకు పనిచేస్తుందనే విషయంలో ప్రస్తుతం అమెరికాలో, మరికొన్ని దేశాల్లో మూడో దశ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఎంఎస్‌డీ ఫార్మా, రిడ్జ్‌బ్యాక్ బయోథెరప్యూటిక్స్ అనే సంస్థతో కలిసి ఈ ప్రయోగాలు చేపట్టింది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో సానుకూల ఫలితాలు రావడంతో ఈ ఔషధం పనితీరుపై ఫార్మా కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయిలో కొవిడ్-19 వ్యాధి సోకిన వారికి మోల్నుపిరవర్‌తో చికిత్స చేస్తే త్వరలో కోలుకునే అవకాశం ఉందని ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారణ కావటం ఈ ఆశాభావానికి ప్రధాన కారణం. దీంతో ఒక్కసారిగా 'మోల్నుపిరవిర్' ఔషధంపై అన్ని వర్గాల్లో ఆసక్తి వ్యక్తం అవుతోంది.