దేశంలో రైతుల కన్నా నిరుద్యోగులు, స్వయం ఉపాధిదారుల ఆత్మహత్యలే అధికమని అధికారిక డేటాలో తెలిసింది. జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం 2018లో ప్రతి రోజూ సగటున 35 మంది నిరుద్యోగులు, 36 మంది స్వయం ఉపాధిదారులు బలవన్మరణాలకు పాల్పడ్డట్లు వెల్లడైంది.
పెరిగన ఆత్మహత్యలు..
2018లో మొత్తం 1,34,516 మంది బలవన్మరణానికి పాల్పడ్డట్లు ఎన్సీఆర్బీ డేటాలో తేలింది. 2017తో పోలిస్తే ఈ సంఖ్య 3.6 శాతం అధికం. 2017లో దేశంలో ఆత్మహత్యల రేటు లక్ష మందికి ఒకరు ఉండగా.. 2018లో ఆ రేటు 0.3 శాతం పెరిగింది.
2018లో మొత్తం ఆత్మహత్యల్లో 12,936 మంది నిరుద్యోగులు (9.8 శాతం), 13,149 మంది స్వయం ఉపాధిదారులు (9.6 శాతం) ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదే సమయంలో 7.7 శాతంతో 10,349 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
మహిళల్లో గృహిణులే అధికం..
2018లో బలవన్మరణానికి పాల్పడ్డ మహిళల్లో 54.1 శాతం గృహిణులేనని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. ఈ సమయంలో మొత్తం 42,391 మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడగా.. వీరిలో 22,937 మంది గృహిణులని గణాంకాలు చెబుతున్నాయి. 2018లో మొత్తం ఆత్మహత్యల్లో మహిళల వాటా 17.1 శాతంగా ఉంది.