మొబైల్.. అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తూ మానవ జీవితాలను శాసించే స్థాయికి చేరుకుంది. మొబైల్ ఫోన్ రాకతో అంతర్జాల వినియోగం భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది మొబైల్ వినియోగిస్తున్నారు. అందులో ఇంటర్నెట్ వాడుతున్నవారెందరు అనే విషయాలపై మార్కెటింగ్ కన్సల్టెన్సీ సంస్థ కెపియోస్ అనాలసిన్ ఓ నివేదిక విడుదల చేసింది. గత ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా 33 కోట్ల మందికిపైగా అంతర్జాల వినియోగదారులు పెరిగినట్లు వెల్లడించింది.
నివేదికలోని కీలక అంశాలు..
- 2021, ఏప్రిల్ నాటికి ప్రపంచ జనాభా సుమారు 7.85 బిలియన్లుగా ఉంది. అందులో 5.27 బిలియన్ల మంది మొబైల్ వినియోగిస్తున్నారు. అంటే.. భూమండలంపై నివసిస్తున్న ప్రజల్లో రెండింట మూడొంతుల మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు.
- గత ఏడాదిలో అంతర్జాలం వినియోగించే వారు 7.6 శాతం (33 కోట్లు) వృద్ధితో 4.72 బిలియన్లకు చేరుకున్నారు. అది ప్రపంచ జనాభాతో పోల్చితే.. 60 శాతానికి పైమాటే.
- ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న వారిలో 21 శాతంతో చైనా తొలి స్థానంలో ఉండగా.. 13 శాతంతో భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికాలో కేవలం 6.3 శాతం మాత్రమే అంతర్జాలం వాడుతున్నారు.
- ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఆరుగురు ఆన్లైన్లో ఉంటున్నారు.