తెలంగాణ

telangana

ETV Bharat / business

సిరి: మాంద్యం వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - అత్యవసర ఆర్థికనిధి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన ఛాయలు కనిపిస్తున్నాయి. వృద్ధి రేటు తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. అనుకోని పరిస్థితులు తలెత్తితే.. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఏమిటో తెలుసుకుందామా?

సిరి: మందగమనంలో... కాస్తా జాగ్రత్తగా!

By

Published : Sep 26, 2019, 5:12 AM IST

Updated : Oct 2, 2019, 1:17 AM IST

ఎటు చూసినా ఆర్థిక మందగమన ఛాయలు కనిపిస్తున్నాయి. వృద్ధి రేటు తగ్గిపోతోంది. దశాబ్దం నాటి పరిస్థితులు మళ్లీ తలెత్తుతాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వినియోగం తగ్గిపోతోంది. ఫలితంగా పలు సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకునే విషయంపై దృష్టి సారించాయి. కంపెనీలు తీసుకునే జాగ్రత్తల సంగతి ఎలా ఉన్నా... వ్యక్తిగతంగా మనమూ కొంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది!

బీమా సంగతి చూడండి

ప్రస్తుతం చాలా సంస్థలు తమ ఉద్యోగుల సంక్షేమం కోసం ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇవి తమ ఖర్చును తగ్గించుకునేందుకు ఈ బీమా సౌకర్యాన్ని ఆపేయాలని నిర్ణయించుకున్నా లేదా ఉద్యోగం కోల్పోయినా... ఆ ఉద్యోగికి ఆరోగ్య బీమా రక్షణ దూరం అవుతుంది. ఒకవైపు ఆదాయం లేకపోగా మరోవైపు అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యం పాలైతే ఎంత ఇబ్బంది? అసలే ప్రస్తుతం ఇంటికి ఇద్దరు జ్వరాలతో బాధపడుతున్న రోజులు. ఈ పరిస్థితులను ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా వ్యక్తిగతంగా ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబం అంతటికీ వర్తించేలా ఎంతో కొంత మొత్తానికి సొంతంగా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని ఎంచుకోండి. ఇంటి రుణం, ఇతర బాధ్యతలు ఉన్నవారు తమ వార్షికాదాయాన్ని అనుసరించి టర్మ్‌ పాలసీని ఎంచుకోవడం మంచింది. ఆరోగ్య, టర్మ్‌ పాలసీలతోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ముఖ్యమే. బీమా ఉండటం వల్ల ఆర్థికంగా ఏ ఇబ్బంది ఎదురైనా ఎదుర్కోగలమనే నమ్మకం వస్తుంది.

క్రెడిట్​ కార్డ్​ అవసరమా?

ఆదాయం ఆగిపోయిన పరిస్థితుల్లో కొన్నిసార్లు అప్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా స్వల్పకాలిక అవసరాలను తీర్చుకునేందుకు డబ్బు అవసరం అయినప్పుడు ఎవరని అడగాలో అర్థం కాదు. బంధువులు, స్నేహితుల దగ్గరా ఆర్థికంగా వెసులుబాటు ఉందో లేదో తెలియదు. ఇలాంటప్పుడే క్రెడిట్‌ కార్డులాంటివి ఆదుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఒక క్రెడిట్‌ కార్డు తీసి పెట్టుకోవడం మంచిది. ఉద్యోగం లేకపోతే కార్డు రావడం కష్టం కావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటుంది. సంక్షోభ సమయంలో అప్పులను నిర్వహించడం కత్తి మీద సాములాంటిదే. ఎప్పటికప్పుడు ఈఎంఐలను చెల్లించడం ఎట్టిపరిస్థితుల్లోనూ మానేయవద్దు. క్రెడిట్‌ కార్డు వాడినప్పుడు కనీస చెల్లింపులతో కాలం గడిపితే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ బిల్లు తేదీ దాటితే క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో అప్పులు రావడం కష్టం కావచ్చు. అందువల్ల అత్యవసరమైతేనే అప్పు చేయండి. అదీ చిన్న మొత్తంలోనే. సమయానికి దాన్ని తీర్చేందుకు ప్రయత్నించండి.

అత్యవసర నిధితో మొదలు

ఎప్పుడు ఏ ఆర్థిక అవసరం వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే, ప్రతి ఒక్కరూ తమ దగ్గర అత్యవసర నిధిగా కొంత మొత్తం ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని చెబుతూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీని అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. కనీసం 6 నెలల జీతానికి సరిపడా మొత్తం బ్యాంకు పొదుపు ఖాతాలో లేదా ఇతర రూపంలో అందుబాటులో ఉండటం ఇప్పుడు తప్పనిసరి. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోవడం లేదా ఆదాయం తగ్గినప్పుడు... మీపై ఉండే ఆర్థిక ఒత్తిడిని ఇది అడ్డుకుంటుంది. కనీసం 6 నెలలే కాదు అంతకుమించి ఉన్నా ఇప్పుడు మంచిదే. దీన్ని జమ చేయడానికి వెంటనే మీ మిగులు మొత్తాన్ని బ్యాంకు రికరింగ్‌ డిపాజిట్లలోకి మళ్లించండి. అత్యవసర నిధి మీ నెలవారీ ఈఎంఐలు, అద్దె, బీమా ప్రీమియం చెల్లింపు, పిల్లల ఫీజులు, ఆరోగ్య ఖర్చులు, నిత్యావసరాలు, ఇతర ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. ఆదాయం ఆగిపోయినప్పుడు.. ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకుంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ నిధిని కేవలం అత్యవసరాల్లో మాత్రమే వాడాలి. విలాసాలకు, అప్రాధాన్య ఖర్చులకు కేటాయించకూడదు. మళ్లీ మీ ఆదాయం గాడిన పడేదాకా ఇదే మీకు ఆధారం అని మర్చిపోకండి.

లెక్క తేడా రావద్దు

ప్రతి రూపాయికీ ఒక లెక్క ఉండాలి. ముఖ్యంగా మనం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క రూపాయైనా విలువైనదే. ఉద్యోగం కోల్పోయే సందర్భం వచ్చినప్పుడు రావాల్సిన అన్ని ప్రయోజనాలూ ఇచ్చేశారా లేదా తెలుసుకోండి. దీంతోపాటు మీరు ఎవరికైనా చేబదుళ్లు ఇచ్చారా? వారి నుంచి వాటిని వసూలు చేసుకునేందుకు ప్రయత్నించండి. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి మర్చిపోయారా? పొదుపు ఖాతాల్లో ఎంతెంత నిల్వ ఉంది అనేదీ చూసుకోండి. విహార యాత్రలకు వెళ్లాలనే ఆలోచన ఉంటే దాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకునేందుకు ప్రయత్నించండి. ఎక్కువగా బయటకు వెళ్లి తినడంలాంటి వాటినీ కాస్త అదుపు చేసుకోవాలి. కొత్త వస్తువులు కొనడానికీ కొంత సమయం వేచి చూడండి. వీలైనంత వరకూ ఇప్పటికిప్పుడు అవసరం లేని వాటన్నింటినీ సాధ్యమైనన్ని రోజులపాటు ఖర్చు చేయకపోవడమే ఉత్తమం. రూపాయిని ఆదా చేస్తే రూపాయి సంపాదించినట్లే. ప్రస్తుతం ఈ ఒక్క సూత్రం ఆధారంగానే మన ఆర్థిక ప్రణాళిక కొనసాగాలి.

పెట్టుబడులు వెనక్కు తీసుకోవద్దు

ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎన్నో పెట్టుబడి పథకాల్లో మదుపు చేసి ఉంటారు. డిపాజిట్లు ఉండి ఉంటాయి. కొన్నాళ్లపాటు ఉద్యోగం కోల్పోతే వీటన్నింటిని వెనక్కి తీసుకోవాలా? అన్ని వేళలా ఇదే సూత్రం పాటించకూడదు. ఒకేసారి మొత్తం పెట్టుబడులను ఉపసంహరించుకొని, నగదుగా మార్చుకోవాలనే ఆత్రం పనికిరాదు. ఉదాహరణకు మీకు ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఉందనుకుందాం. అది మీ దీర్ఘకాలిక పదవీ విరమణ లక్ష్యానికి సంబంధించింది. ఇందులో నుంచి మొత్తం డబ్బును తీసేసుకుంటే... మీ పదవీ విరమణ అవసరాలకు ఇబ్బంది ఏర్పడవచ్చు. ఆదాయం ఆగిపోవడం తాత్కాలికమే. మళ్లీ ఆదాయం ప్రారంభం అయ్యేలోపు ఈ దీర్ఘకాలిక పెట్టుబడిని తీసుకోవాలనుకోవడం మంచిది కాదు. మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేస్తున్నారనుకుందాం. వాటిలో పెట్టుబడికి ఏదో ఒక ఆర్థిక లక్ష్యాన్ని ముడిపెట్టి ఉంటారు. కాబట్టి, వాటిని వెనక్కి తీసుకోవడం వల్ల ఆ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది.

ముందుగా మీ అత్యవసర నిధి సరిపోయేంత ఉందా చూసుకోండి. లేకపోతే ఏ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ద్వారా దాన్ని భర్తీ చేయాలో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉంటే.. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. తక్కువ రాబడినిచ్చే పథకాల్లో ఉన్న డబ్బును ముందుగా తీసేసుకోవాలి. ఆ తరువాత వృద్ధికి పెద్దగా అవకాశం కనిపించని వాటిని ఉపసంహరించాలి. ఉదాహరణకు షేర్లలో పెట్టుబడులు ఉన్నా.. అవి ఆశించిన లాభాలను అందించకపోతే, బ్యాంకు పొదుపు ఖాతాకన్నా తక్కువ రాబడినిస్తున్న బీమా పాలసీలను ఒకసారి సమీక్షించాలి. అప్పటికీ ఆర్థికంగా ఇంకా గట్టెక్కకపోతే దీర్ఘకాలిక మదుపు పథకాలపై దృష్టి పెట్టాలి. మీ ఆదాయం తిరిగి ప్రారంభంకాగానే ఈ పెట్టుబడుల నుంచి తీసిన మొత్తాన్ని తిరిగి భర్తీ చేయడం మర్చిపోకండి.

- అధిల్​ శెట్టి, బ్యాంక్ బజార్​ డాట్​ కామ్​ సీఈఓ

Last Updated : Oct 2, 2019, 1:17 AM IST

ABOUT THE AUTHOR

...view details