గత వారాంతం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా తేరుకోలేదు. నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం ఆటుపోట్ల నడుమ కొనసాగాయి.
సెన్సెక్స్ 151.45 పాయింట్లు పతనమై 36,395 వద్ద ముగిసింది. గత రెండు సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 429 పాయింట్లు కోల్పోయింది.
నిఫ్టీ 49.80 పాయింట్లు కోల్పోయి 10,857.10 వద్ద సెషన్ ముగించింది.
ఇదీ కారణం
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు, ఈ వారాంతంలో వెల్లడికానున్న పరిశ్రమ ఉత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి కారణంగా మదుపరులు అప్రమత్తత పాటించారు. పెద్ద సంస్థలు ప్రకటిస్తున్న ఫలితాలు అంచనాలను అందుకోని కారణంగా మదుపరులు ముందస్తు చర్యలకు దిగారు. దీంతో ప్రధాన రంగాల్లో అమ్మకాలు ఒత్తిడితో నష్టాలు తప్పలేదని స్టాక్ నిపుణులు చెప్పారు.
పెరిగినవి, తగ్గినవి
ఓఎన్జీసీ, బజాజ్‌ఫైనాన్స్, రిలయన్స్, ఎస్బీఐ, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, వేదాంతా, ఎస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల షేర్లు 2.54 శాతం నష్టపోయాయి.
టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, కోటక్ బ్యాంకు, మారుతీ సంస్థలు 2.31 శాతం మేర లాభాలను ఆర్జించాయి.