పెట్టుబడుల ఉపసంహరణ నిమిత్తం రూపొందించిన నూతన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్ఈ) విధానంలో కేంద్రం పలు మార్పులు చేసింది. ప్రధాన పోర్టు ట్రస్టులు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), భద్రతా పరమైన ప్రింటింగ్, నగదు ముద్రణ నిర్వహించే సంస్థలను వ్యూహాత్మకం, వ్యూహత్మకం కాని రంగాలుగా వర్గీకరించింది. వాటా విక్రయాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు(సీపీఎస్ఈలు), ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలకు పరిమితం చేసింది. లాభాపేక్ష రహిత కంపెనీలు, బలహీన వర్గాలకు తోడ్పాటు ఇస్తున్న సీపీఎస్ఈలు, అభివృద్ధిలో భాగమైన కొన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలకు నూతన పీఎస్ఈ విధానం వర్తించదు. గతవారం బడ్జెట్లో పెట్టుబడులు ఉపసంహరణ/వ్యూహాత్మక వాటా విక్రయం విధాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో ఏముందంటే..
మొత్తం రంగాలను నాలుగు వ్యూహాత్మక రంగాలుగా విభజించారు. ఇందులో ప్రభుత్వం అట్టి పెట్టుకోనున్న ప్రభుత్వం రంగ సంస్థలను బాగా కుదించారు. మిగిలిన వాటిని ప్రైవేటీకరణ చేయడం లేదా విలీనం, మరో ప్రభుత్వం సంస్థకు అనుబంధ సంస్థగా మార్చడం లేదా మూసివేయడం చేయనున్నారు. నాలుగు రంగాలుగా అణుశక్తి, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్,పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలను వ్యూహత్మకం కాని వాటిగా చేశారు. సీపీఎస్ఈలను ప్రైవేటీకరించడం లేదా మూసివేతకు పరిశీలించనున్నారు. రైల్వే, తపాలా, వంటి ప్రభుత్వ రంగాలకు నూతన పీఎస్ఈ విధానం వర్తించదు.