కరోనాతో ఆదాయం తగ్గిన వివిధ రంగాల వారికి మారటోరియంతో ఊరట కల్పించామని, రుణగ్రహీతలకు చక్రవడ్డీ మాఫీ చేశామని వెల్లడించింది కేంద్రం. ఇంతకంటే ఎక్కువ ఉపశమనాలు ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. రుణాల చెల్లింపునకు ఇప్పటికే ఆరునెలల మారటోరియం ప్రకటించామని, దీన్ని మరింత కాలం పొడగించడం కుదరదని వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు
సమర్పించిన తాజా అఫిడవిట్‌లో పేర్కొంది.
'కోర్టు జోక్యం తగదు'..
రుణగ్రహీతలకు ఊరట కలిగించేలా మారటోరియం కాలంలో విధించే చక్రవడ్డీని మాఫీ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సంయుక్తంగా శుక్రవారం మరో అఫిడవిట్ దాఖలు చేశాయి. ఆర్థిక విధానాలు ప్రభుత్వానికి చెందినవని, ఇందులో కోర్టుల జోక్యం తగదని కేంద్రం అభిప్రాయపడింది.
చక్రవడ్డీ మాఫీ చేయడం కాకుండా ఇంకే ఇతర ఉపశమనాలు కల్పించలేమని స్పష్టం చేసింది. అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం ప్రమాదంలో పడతాయని పేర్కొంది. రంగాలవారీగా ఉపశమనం కల్పించడం కుదరదని తెలిపింది. కామత్ కమిటీ నివేదిక కూడా ఇదే చెబుతోందని వెల్లడించింది.
పొడిగించలేం: ఆర్‌బీఐ
మరోవైపు రుణాలపై మారటోరియం గడువును మరింతకాలం పొడిగించలేమని ఆర్‌బీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. మారటోరియం కాలాన్ని పెంచితే అది వాయిదాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడింది. అంతేగాక రుణగ్రహీతలపై భారం పెరుగుతుందని పేర్కొంది. ఈ అఫిడవిట్‌పై అక్టోబరు 13న కోర్టు విచారణ జరపనుంది.
సుప్రీంలో వాదనలు
కరోనా కారణంగా మార్చి 1 నుంచి మే 31 వరకు మారటోరియం ప్రకటిస్తున్నామని, రుణాలు, వడ్డీలకు సంబంధించిన కిస్తీల చెల్లింపులను వాయిదా వేసుకోవచ్చని పేర్కొంటూ మార్చి 27న రిజర్వు బ్యాంకు సర్క్యులర్ జారీ చేసింది. తరువాత ఈ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. అయితే దీనివల్ల భారమేమీ తగ్గదని, ఆ తర్వాతైనా చక్రవడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీనిపై న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించగా.. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్నవారికి మారటోరియం కాలంలో విధించే చక్రవడ్డీని మాఫీ చేస్తామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఈ మేరకు గతవారం ప్రమాణపత్రం దాఖలు చేసింది.
అయితే కేంద్రం సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషన్‌దారులు లేవనెత్తిన అంశాలను పరిశీలించడంలో కేంద్రం విఫలమైందని పేర్కొంది. రంగాల వారీగా ఎలాంటి ఉపశమనాలు కల్పిస్తారో చెబుతూ కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అయితే అది సాధ్యం కాదని కేంద్రం తాజా ప్రమాణ పత్రంలో స్పష్టం చేసింది.
ఇదీ చదవండి-'చక్రవడ్డీ' మాఫీ అంశంలో కేంద్రంపై సుప్రీం అసంతృప్తి