ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (Vodafone Idea) బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవుల నుంచి కుమార మంగళం బిర్లా వైదొలిగారు. తనను తప్పించాలన్న బిర్లా అభ్యర్థనకు బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న హిమాన్షు కపానియాను నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. వొడాఫోన్ ఐడియాలోని తన వాటాను వదులుకునేందుకు సిద్ధం అంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాసినట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.
నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన బిర్లా
వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవుల నుంచి కుమార మంగళం బిర్లా తప్పుకున్నారు. బిర్లా స్థానంలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా హిమాన్షు కపానియాను బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
ప్రస్తుతం వీఐఎల్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏజీఆర్ ఛార్జీలు, స్పెక్ట్రం కేటాయింపు బకాయిల మారిటోరియంపై ప్రభుత్వం నుంచి కొత్త పెట్టుబడిదారులు కచ్చితమైన పూచీ కోరుతున్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కచ్చితమైన సహకారం అవసరమని బిర్లా ఇటీవల కేబినెట్ సెక్రటరీని కోరుతూ లేఖ రాశారు. లేదంటే కంపెనీ కార్యకలాపాలు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, 27 కోట్ల కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ ప్రతిపాదనతో ముందుకు వచ్చానని లేఖలో పేర్కొన్నారు. బిర్లాకు వొడాఫోన్ ఐడియాలో 27 శాతం వాటాలు ఉన్నాయి. మరోవైపు బిర్లా లేఖ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేర్లు బుధవారం నాటి ట్రేడింగ్‌లో 16 శాతం మేర క్షీణించాయి.
ఇదీ చదవండి :నెగ్గడమే కాదు.. తగ్గడమూ తెలిసిన బిర్లా!