తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన రిటైల్​ ద్రవ్యోల్బణం.. జులైలో 3.15 శాతం

2019 జులైలో వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.15 శాతానికి తగ్గింది. ఆహార పదార్థాల ధరలు ప్రియమైనప్పటికీ.. ఇంధన, విద్యుత్ ధరలు దిగిరావడం ఇందుకు దోహదపడింది.

జులైలో 3.15 శాతానికి పరిమితమైన రిటైల్ ద్రవ్యోల్బణం

By

Published : Aug 14, 2019, 8:30 AM IST

Updated : Sep 26, 2019, 10:54 PM IST

వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో స్వల్పంగా తగ్గింది. ఆహార పదార్థాల ధరలు పెరిగినప్పటికీ... ఇంధనం, విద్యుత్​ ధరలు దిగిరావడం ఇందుకు దోహదపడింది. 2019 జూన్​లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.18 శాతం ఉండగా, జులైలో 3.15 శాతానికి తగ్గింది.

కీలక రేట్లపై నిర్ణయం తీసుకునే ముందు రిటైల్ ద్రవ్యోల్బణం రేట్లను ఆర్​బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఆర్​బీఐ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపు కట్టడి చేసేందుకు నిర్ణయించుకుంది. ఇప్పుడు జులైలో నమోదైన రిటైల్​ ద్రవ్యోల్బణం కూడా నిర్దేశిత లక్ష్యమైన 4 శాతంలోపే ఉండటం గమనార్హం.

ఆహార పదార్థాల ధరల విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్​ హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాల్లో వరదలు, కూరగాయల ధరలు పెరగడం, ఖరీఫ్​ సాగు ఆలస్యం కావడం లాంటివి ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

కేంద్ర గణాంక కార్యాలయం లెక్కల ప్రకారం..

* జులైలో ఆహార పదార్థాల ధరల్లో 2.36 శాతం పెరుగుదల ఉంది. జూన్​లో వీటి ద్రవ్యోల్బణ రేటు 2.25 శాతంగా ఉంది.

* కూరగాయలు 2.82 శాతం చౌక అయ్యాయి. పప్పు ధాన్యాల ధరలు 6.82 శాతం మేర పెరిగాయి.

* జూన్​లో కూరగాయలు, పప్పుల ద్రవ్యోల్బణం రేట్లు వరుసగా 4.66 శాతం, 5.68 శాతంగా ఉన్నాయి.

* ఫలాల ద్రవ్యోల్బణం రేటు -4.18 శాతం నుంచి -0.86 శాతానికి చేరింది.

* ఇంధనం, విద్యుత్ విభాగం ప్రతిద్రవ్యోల్బణం -0.36 శాతంగా ఉంది. జూన్​లో ఈ విభాగం ద్రవ్యోల్బణం రేటు 2.32 శాతంగా ఉంది.

ఇదీ చూడండి: 'సీతాకోక చిలుక' టీ పొడి... కిలో రూ.75వేలే!

Last Updated : Sep 26, 2019, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details