IT Raids on Foreign Companies: విదేశీ మొబైల్ తయారీ కంపెనీలపై జరిపిన దాడులకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపెట్టింది ఐటీ శాఖ. లెక్కకురాని రూ.6,500 కోట్ల లావాదేవీలను గుర్తించింది. ప్రధానంగా రెండు కంపెనీలు రాయల్టీ రూపంలో విదేశాల్లో ఉన్న తమ గ్రూప్ కంపెనీలకు అక్రమంగా రూ.5,500 కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు వెల్లడించింది. సోదాల సమయంలో సేకరించిన వివరాలకు.. ఆయా కంపెనీలు ఇచ్చిన సమాచారానికి ఎక్కడా సంబంధం లేదని అధికారులు గుర్తించారని తెలిపింది.
తప్పుడు లెక్కలతో విదేశీ నిధులు సుమారు రు.5,000 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లుగా చూపి.. దానిపై వడ్డీ, ఖర్చులు కూడా క్లెయిమ్ చేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఆ ఖర్చు సుమారు రూ.1400కోట్లుగా పేర్కొన్నట్లు తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం-1961 కింద నిర్దేశించిన నిబంధనలను పాటించలేదని తెలిపింది. ఇందుకు గాను రూ.1000 కోట్ల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీకి సంబంధించిన విడి భాగాలను కొనుగోలు చేసే విధానాన్ని కూడా బయటపెట్టామని అన్నారు.